నడిరోడ్డుపై వీఆర్వోను పట్టుకున్న ఏసీబీ అధికారులు | - | Sakshi
Sakshi News home page

నడిరోడ్డుపై వీఆర్వోను పట్టుకున్న ఏసీబీ అధికారులు

Published Sat, Aug 12 2023 1:44 AM | Last Updated on Sat, Aug 12 2023 1:55 PM

- - Sakshi

కనిగిరి రూరల్‌: పాస్‌ పుస్తకాల మ్యుటేషన్‌కు వీఆర్వో లంచం డిమాండ్‌ చేయడంతో డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక కనిగిరి మండలం ఏరువారిపల్లి వీఆర్వో వేణుగోపాల్‌రెడ్డిని అదే సచివాలయ పరిధిలో పనిచేసే వలంటీర్‌ ఏసీబీ అధికారులకు పట్టించాడు. వివరాల్లోకి వెళితే కనిగిరి మండలం పేరంగుడిపల్లికి చెందిన వీరంరెడ్డి భాస్కర్‌రెడ్డి గోసులవీడు గ్రామవలంటీర్‌గా పనిచేస్తున్నాడు.

అతని తండ్రి లక్ష్మీరెడ్డి పేరు మీద మండలంలోని అజీస్‌పురంలో 2.73 ఎకరాల భూమి ఉంది. దీన్ని మ్యుటేషన్‌ చేయించుకునేందుకు గత నెల 24న గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. ఆ తర్వాత పాస్‌బుక్‌ల మ్యుటేషన్‌ కోసం వీఆర్వో వేణుగోపాల్‌రెడ్డిని కలిశాడు. అతను రూ.30 వేలు లంచం డిమాండ్‌ చేశాడు. చివరకు ఇద్దరి మధ్య రూ.21 వేలకు బేరం కుదిరింది. లంచం ఇవ్వడం ఇష్టంలేని వీఆర్వో ఏసీబీ అధికారులకు ఈనెల 9న ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణ జరిపిన ఏసీబీ అధికారులు 11న శుక్రవారం కేసు రిజస్టర్‌ చేసుకుని.. ఏసీబీ డీఎస్పీ వీ శ్రీనివాసరావు బృందం దాడులు నిర్వహించింది.

వెంటాడి నడిరోడ్డుపై పట్టుకున్న ఏసీబీ అధికారులు..
ముందస్తుగా వేసుకున్న పథకం ప్రకారం ఏసీబీ అధికారులు రైతుల వేషధారణలో తహసీల్దార్‌, ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణాల్లో కాపు కాశారు. ఏసీబీ అధికారులు వీరం రెడ్డి భాస్కర్‌రెడ్డి చేతికి రూ.21 నగదును అందజేశారు. సుమారు 12 గంటల సమయంలో భాస్కర్‌రెడ్డి.. వీఆర్వో వేణుగోపాల్‌రెడ్డికి నగదు ఇస్తానని చెప్పాడు. దీంతో వీఆర్వో , వలంటీర్‌ని బైక్‌ పై ఎక్కించుకుని పట్టణంలో కందుకూరు రోడ్డు వైపు ఉన్న కపిలా హోటల్‌ సెంటర్‌కు తీసుకెళ్లి నగదు తీసుకున్నాడు. అప్పటికే వీఆర్వోను వెంటాడుతున్న ఏసీబీ ట్రాప్‌ పార్టీ అధికారులు ఒక్క సారిగా రోడ్డుపై చుట్టుముట్టారు.

దాన్ని గమనించిన వీఆర్వో తీసుకున్న నగదును జేబులో నుంచి కింద పడేశాడు. వెంటనే ఏసీబీ అధికారులు వీఆర్వో రెండు చేతులు గట్టిగా వెనక్కి మడిచి పట్టుకున్నారు. రోడ్డు పైనే స్టూల్‌ పెట్టి ఏసీబీ అధికారులు వెంట తెచ్చిన రసాయనం కలిపిన నీటిలో వీఆర్వో చేతులను కడిగించగా, నీళ్లు రంగు మారాయి. ఈ ఘటన అంతా నడిరోడ్డుపై దాదాపు 15 నిమిషాలు సాగింది.

ట్రాఫిక్‌కు అంతరాయంగా మారడంతో వీఆర్వో వేణును పోలీసుల సహకారంతో తహసీల్దార్‌ కార్యాలయ ప్రాంగణానికి తరలించి, తదుపరి విచారణ ప్రక్రియ ప్రారంభించారు. వీఆర్వో వద్ద లెక్కలో లేని నగదు మరో రూ.32,300 ఉంది. ఏసీబీ అధికారుల ట్రాప్‌నకు ముందు ఇద్దరు రైతుల వద్ద ఈ నగదును తీసుకున్నట్లు అధికారులు గుర్తించి, విచారణ జరిపి వారి వద్ద కూడా ఫిర్యాదు తీసుకుంటామని తెలిపారు.

మాచవరంలోని ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు:
వీఆర్వో వేణుగోపాల్‌రెడ్డి స్వగ్రామమైన మాచవరానికి వెళ్లి అతని ఇంట్లో ఏసీబీ సీఐ అపర్ణ సోదాలు నిర్వహించారు. ఇంట్లో 10 ఈ–పాస్‌ బుక్‌లు ఐదేళ్ల నాటివి దొరికినట్లు ఏసీబీ డీఎస్పీ వీ శ్రీనివాసరావు తెలిపారు. అయితే ఆ పాస్‌బుక్‌లు తిరిగి ఇవ్వకుండా అతని దగ్గరే ఎందుకు ఉంచుకున్నాడు అనే దానిపై విచారణ చేపడతామని డీఎస్పీ వెల్లడించారు. వీఆర్వో వేణుగోపాల్‌రెడ్డి అరెస్ట్‌ చేసి నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరు పర్చనున్నట్లు తెలిపారు. ఏసీడీ దాడుల్లో ఏసీబీ సీఐలు అపర్ణ, సీహెచ్‌ శేషు, టీవీ శ్రీనివాసులు, ఎస్సై జేవీఎన్‌ ప్రసాద్‌, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ వీ శ్రీనివాసరావు మాట్లాడుతూ బాధితుడు వీరం రెడ్డి భాస్కర్‌రెడ్డి తొలుత ఈనెల 6న 14400 యాప్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఎవరైనా అధికారులు లంచం డిమాండ్‌ చేస్తే 14400 యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఫిర్యాదుదారుల పేర్లను, వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. తర్వాత విచారణ జరిపి నిజమైతే చర్యలు తీసుకుంటామన్నారు.

అధికారులు పరార్‌..
వీఆర్వో వేణుగోపాల్‌రెడ్డిని ఏసీబీ అధికారులు పట్టుకోగానే వివిధ శాఖ అధికారులు పరారయ్యారు. ప్రధానంగా తహసీల్దార్‌ కార్యాలయంలోని వీఆర్వోలు, వివిధ స్థాయిల్లోని అధికారులు అదృశ్యమయ్యారు. రెవెన్యూ కార్యాలయ ప్రాంగణంలో సబ్‌ రిజిస్టర్‌ ఆఫీసులోని అధికారులు, సిబ్బంది, డాక్యుమెంట్‌ రైటర్లు పత్తా లేకుండా పోయారు. బిక్కు బిక్కు మంటూ సబ్‌ రిజిస్టర్‌ ఆఫీసులో ఇతర సిబ్బంది విధులు నిర్వహించారు. ఏసీబీ అధికారులు కనిగిరి వదిలి పోయేంత వరకు పలు శాఖల ఉన్నతాధికారులు వారి సీట్లల్లో కూర్చోలేదంటే అతిశయోక్తి కాదు. పలువురు వీఆర్వోలు, రెవెన్యూ, ఇతర రెండు శాఖల్లోని ప్రధాన అధికారుల పేర్లు ఏసీబీ జాబితాలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement