బాధితులను పరామర్శిస్తున్న ట్రైనీ ఎస్పీ అంకితా సురానా
ప్రకాశం: తన కుమార్తెను కులాంతర వివాహం చేసుకున్న యువకుడి తల్లి, అక్కపై యువతి తల్లిదండ్రులు దాడిచేసి గాయపరిచిన సంఘటన దర్శి మండలం బొట్లపాలెం ఎస్సీ కాలనీలో చోటుచేసుకుంది. డీఎస్పీ అశోక్‌వర్ధన్ తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన గంగిరెడ్డి బ్రహ్మారెడ్డి, పుల్లమ్మ దంపతుల కుమార్తె భార్గవి ఎస్సీ కులానికి చెందిన అనురాధ కుమారుడు సాయిరాం మార్చి 2వ తేదీన వివాహం చేసుకున్నారు. వారి వినతి మేరకు రక్షణ కల్పించాలని ఎస్పీ మలికాగర్గ్ దర్శి పోలీసులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇరువురి తల్లిదండ్రులను పిలిపించి తహసీల్దార్ సమక్షంలో బైండోవర్ చేసి ఎలాంటి గొడవలు పడవద్దని చెప్పి పంపారు.
ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని బ్రహ్మారెడ్డి, ఆయన భార్య పుల్లమ్మ కలిసి అర్ధరాత్రి ఎస్సీ కాలనీకి వెళ్లి యువకుడి తల్లి అనూరాధ, ఆమె కుమార్తె మౌనిక కళ్లలో కారం కొట్టి దాడి చేశారు. మౌనికను కత్తితో పొడవబోగా చేయి అడ్డు పెట్టడంతో ఆమె చేతికి గాయమైంది. ఇనుపరాడ్డుతో తలపై కొట్టి గతంలో ఉన్న కేసులు వెనక్కి తీసుకోవాలని, లేదంటే చంపేస్తామని భయబ్రాంతులకు గురిచేశారు. వారిద్దరినీ కొట్టుకుంటూ బ్రహ్మారెడ్డి ఇంటికి తీసుకువెళ్లి కట్టేశారు.
విషయం తెలుసుకున్న స్థానికులు డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై రామకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బ్రహ్మారెడ్డి ఇంట్లో తాళ్లతో కట్టేసి ఉన్న అనూరాధ, అపస్మారక స్థితిలో ఉన్న మౌనికను గుర్తించారు. వారిని పోలీసు వాహనంలో తీసుకెళ్లి దర్శి సీహెచ్‌సీలో వైద్యం అందించారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ అశోక్‌వర్థన్ తెలిపారు. బాధితులను ట్రైనీ ఎస్పీ అంకితా సురానా పరామర్శించారు. ఘటనకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment