మాటపై నిలబడే జగనన్నకే మా మద్దతు | Sakshi
Sakshi News home page

మాటపై నిలబడే జగనన్నకే మా మద్దతు

Published Mon, May 6 2024 9:40 AM

మాటపై నిలబడే జగనన్నకే మా మద్దతు

మార్కాపురం: మాట ఇస్తే ఎంత దూరమైనా వెళ్లే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సారధ్యంలోని వైఎస్సార్‌ సీపీకే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత 30 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు మాదిగలను మోసం చేశాడని ధ్వజమెత్తారు. చెప్పుకుట్టి, డప్పుకొట్టి నేనే పెద్ద మాదిగనవుతానని పలుమార్లు వర్గీకరణకు మద్దతు తెలిపి మాదిగలను దారుణంగా మోసం చేశాడని మండిపడ్డారు. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత మాదిగలను, ఎమ్మార్పీఎస్‌ను తీవ్రంగా అణచివేశాడన్నారు. కార్యకర్తలపై కేసులు పెట్టి జైలుకు పంపాడన్నారు. ఎమ్మార్పీఎస్‌ ఉద్యమాన్ని అణచి మందకృష్ణను రాష్ట్రంలో అడుగుపెట్టనీయకుండా అడ్డుకున్న చంద్రబాబుకు మళ్లీ మద్దతు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. మందకృష్ణ మాదిగ బీజేపీ విషకౌగిలిలో కరిగిపోతూ నరేంద్రమోడీ వద్ద కన్నీళ్లు పెట్టుకుని కాళ్లు పట్టుకునే దౌర్భాగ్య పరిస్థితికి ఎందుకు వచ్చాడో ప్రజలు అర్థం చేసుకొని బుద్ధి చెప్పాలన్నారు. రాజ్యాంగంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడే కూటమి అభ్యర్థులను చిత్తు చిత్తుగా ఓడించాల్సిన అవసరం ఉందన్నారు. అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని తిరుపతిలో వెంకన్నస్వామి సాక్షిగా మాదిగలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని బీజేపీని ఆయన ప్రశ్నించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా గత 10 ఏళ్లలో ఎన్నో బిల్లులను చట్టం చేసుకున్న బీజేపీ..అర్ధ రూపాయి ఖర్చుకాని ఎస్సీ వర్గీకరణ అంశాన్ని మభ్య పెట్టి, మోసం చేసి పార్లమెంట్‌లోని అంశాన్ని సుప్రీం కోర్టులోకి తోసేసి చేతులు దులుపుకొని మీతో కలిసి పనిచేస్తానంటూ మాట్లాడిన మోడీ వ్యాఖ్యలను మాదిగల గొంతు కోసినట్లుగా భావిస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి వారిని గెలిపిస్తే దేశంలో క్రైస్తవులు, ముస్లింలు, దళితులకు రక్షణ కరువవుతుందన్నారు. చంద్రబాబుతో తనకు ప్రాణహాని అన్న మందకృష్ణ ఇవాళ స్నేహం చేయడానికి కారణాలేమిటో తెలియజేయాలన్నారు. ఎస్సీ వర్గీకరణపై సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టమైన వైఖరితో ఉన్నారని చెప్పారు. మాదిగలను రాజకీయంగా మరిన్ని అవకాశాలు కల్పిస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారని, ఆయన మాటపై నమ్మకంతో జగన్‌ గెలుపే పేద వర్గాల గెలుపుగా భావిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నట్లు వివరించారు. సీఎం జగన్‌ మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌గా భావిస్తున్నారన్నారు. చంద్రబాబు మానిఫెస్టో అసత్యాలు, అబద్ధాలు, మోసాలతో కనిపిస్తోందన్నారు. అనంతరం జగన్‌ గెలుపు పేద వర్గాల గెలుపు పోస్టర్‌ను ఆవిష్కరించారు. నాయకులు పానుగంటి షాలేమ్‌రాజ్‌, మందాడి పీటర్‌ మాదిగ, డి.రమేష్‌ మాదిగ, డి.విజయ్‌, రోజ్‌లిడియా, కె.జయమ్మ, ప్రియాంక, ఉస్మాన్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

నాడు చంద్రబాబుతో ప్రాణహాని అని..

నేడు మద్దతివ్వడానికి కారణమేంటి..?

వెంకన్న సాక్షిగా వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామన్న బీజేపీ మాటలేమయ్యాయి

ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు ఉసురుపాటి

బ్రహ్మయ్యమాదిగ

Advertisement
Advertisement