వైఎస్‌ జగన్‌తోనే బలిజల సంక్షేమం, అభివృద్ధి | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌తోనే బలిజల సంక్షేమం, అభివృద్ధి

Published Mon, May 6 2024 9:40 AM

వైఎస్‌ జగన్‌తోనే బలిజల సంక్షేమం, అభివృద్ధి

ఒంగోలు: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తోనే బలిజ, తెలగ, కాపుల అభ్యున్నతి అని ఏపీ బలిజ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కూనపరెడ్డి శివశంకరరావు పేర్కొన్నారు. స్థానిక తన కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ కాపులకు 31 మందికి ఎమ్మెల్యే సీట్లు, 5 ఎంపీ సీట్లు ఇచ్చి సముచిత స్థానం కల్పించిందన్నారు. కానీ ప్రతిపక్ష కూటమి పార్టీలు అన్నీ కలిసి కూడా 23 ఎమ్మెల్యే, మూడు ఎంపీ సీట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నాయన్నారు. బలిజ కాపులకు జగన్‌ ప్రభుత్వం చేసిన మంచి గత 60 ఏళ్లలో ఏ ప్రభుత్వం చేయలేదన్నారు. గతంలో చంద్రబాబు బలిజ కాపులకు చేసిన సాయం కేవలం రూ.1340 కోట్లు మాత్రమే అని, కానీ జగన్‌ ప్రభుత్వం కాపు నేస్తం పథకం ద్వారా అందించిన సాయం రూ.2029 కోట్లు అన్నారు. గత 52 నెలల్లో జగన్‌ ప్రభుత్వం 77 లక్షల మంది లబ్ధిదారులకు నగదు బదిలీ పథకం ద్వారా రూ.22,333 కోట్లు, నాన్‌ డీబీటీ ద్వారా రూ.16,914 కోట్లు బలిజ, కాపు, తెలగ, ఒంటరి కులాలకు చేకూర్చిన మొత్తం లబ్ధి రూ.39,247 కోట్లు అని చెప్పారు. ఈ సంక్షేమం పొందిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ అభివృద్ధికి అండగా నిలుస్తారన్నారు.

వడదెబ్బకు వృద్ధురాలు మృతి

మర్రిపూడి: ఎండలు విపరీతంగా కాస్తున్న నేపథ్యంలో వడదెబ్బ తగిలి వృద్ధురాలు మృతిచెందిన సంఘటన మర్రిపూడి మండలంలోని తంగెళ్ల గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన బయలరాజు నాగరత్తమ్మ (70) గ్రామ సమీపంలో సాగుచేసిన మిరప చేను వద్దకు వెళ్లింది. ఎండ తీవ్రత తట్టుకోలేక కళ్లుతిరిగి కిందపడిపోయింది. బంధువులు ఇంటికి తీసుకొచ్చిన కొద్దిసేపటికే మృతి చెందింది. ఆమెకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.

Advertisement
Advertisement