కూటమి నేతలకే జై..ప్రొటోకాల్ నై..
ఒంగోలు అర్బన్: జిల్లా యంత్రాంగం కూటమి నేతలకు జై కొడుతున్నారు. ప్రభుత్వం తరఫున ఏ కార్యక్రమం జరిగినా ప్రొటోకాల్‌ను పాటించకుండా కేవలం పచ్చ నేతలకే పెద్ద పీట వేస్తున్నారు. మంగళవారం విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఆ కార్యక్రమానికి కలెక్టరేట్‌లో ప్రధాన గేటు నుంచి కార్యక్రమం నిర్వహించే భవనం వరకు అరడజను పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫ్లెక్సీల్లో సైతం కేవలం టీడీపీ నేతల ఫొటోలను మాత్రమే ముద్రించి యంత్రాంగం నేతల మెప్పు పొందేందుకు అత్యుత్సాహం చూపారు. ఫ్లెక్సీల్లో సీఎంతో పాటు మంత్రి స్వామి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ మాగుంట, స్థానిక ఎమ్మెల్యే దామచర్లతో పాటు కనిగిరి, మార్కాపురం, ఎస్‌ఎన్‌పాడు, గిద్దలూరు ఎమ్మెల్యేలు, మేయర్ ఫొటో ముద్రించారు.
కనిపించని జిల్లా కలెక్టర్, జెడ్పీ చైర్మన్, దర్శి, వైపాలెం ఎమ్మెల్యేల ఫొటోలు, పేర్లు:
ఆ ఫ్లెక్సీల్లో కనీసం కలెక్టర్ తమీమ్ అన్సారియా పేరు కానీ, ఫొటోకానీ కనిపించకపోవడం విశేషం. అంతేకాకుండా జిల్లా ప్రథమ మహిళ అయిన జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ఫొటో, పేరు కూడా లేకపోవడం మహిళలకు ఏ పాటి గౌరవం దక్కుతుందో అర్థమవుతోంది. వీరితో పాటు దర్శి, యర్రగొండపాలెం ఎమ్మెల్యేల ఫొటోలు, పేర్లు కూడా లేవు. ఆ నియోజకవర్గాలు మన జిల్లాలో లేవని భావించారో లేక వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలని పక్కన పెట్టారో అధికార యంత్రాంగానికే తెలియాలి. అధికార యంత్రాంగం ప్రొటోకాల్ పాటించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వయోవృద్ధుల దినోత్సవంలో అధికారుల అత్యుత్సాహం ఏర్పాటు చేసిన ఫెక్సీల్లో కేవలం జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేల ఫొటోలు మాత్రమే కనిపించని కలెక్టర్, జెడ్పీ చైర్మన్, దర్శి, వైపాలెం ఎమ్మెల్యేల ఫొటోలు, పేర్లు
Comments
Please login to add a commentAdd a comment