నేటి నుంచిరెసిడెన్షియల్ శిక్షణ
ఒంగోలు సిటీ: జిల్లాలోని స్కూల్ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రాంనకు కేటాయించిన ప్రిన్సిపాల్, ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు ఈ నెల 25 నుంచి 6 రోజుల పాటు ఒంగోలులోని శ్రీరామచంద్రమిషన్ లో జరిగే రెసిడెన్షియల్ శిక్షణకు హాజరు కావాలని డీఈఓ అత్తోట కిరణ్‌కుమార్ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా డీఈఓ కిరణ్‌కుమార్ మాట్లాడుతూ 1, 2 తరగతులు బోధించే ఉపాధ్యాయులకు 25వ తేదీ సోమవారం నుంచి చీరాలలో జరిగే ఎఫ్.ఎల్.ఎన్ ట్రైనింగ్ కు విధులు కేటాయించిన ఉపాధ్యాయులు కూడా హాజరు కావాలన్నారు. విధులు కేటాయించిన వారి వివరాలు ఇప్పటికే మెయిల్, వాట్సప్ ద్వారా పంపించినట్లు తెలిపారు. ఉపవిద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు విధులు కేటాయించిన వారిని వెంటనే రిలీవ్ చేయాలని ఆదేశించారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ నెపంతో వేధిస్తే కఠిన చర్యలు
● కలెక్టర్ తమీమ్ అన్సారియా
ఒంగోలు అర్బన్: ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యల కారణంగా విద్యార్థులకు హాల్‌టికెట్‌లు ఇవ్వకుండా, ప్రాక్టికల్ పరీక్షలను నిరోధించడం వంటి ఇబ్బందులు, వేధింపులు చేస్తే ఆయా కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తమీమ్ అన్సారియా హెచ్చరించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యలతో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఫిర్యాదు వస్తున్నాయని కాలేజిలకు ప్రభుత్వం చెల్లించేలా ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయని, ఆ ఉత్తర్వులు మీరి విద్యార్థుల సర్టిఫికెట్‌లు నిలుపుదల చేయడం వంటి చర్యలు తీసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరిస్తూ ప్రకటన విడుదల చేశారు.
ఘనంగా యూటీఎఫ్ స్వర్ణోత్సవ సభలు
ఒంగోలు సిటీ: యూటీఎఫ్ ఆవిర్భవించి 50 సంవత్సరాలు నిండిన సందర్భంగా జిల్లా యూటీఎఫ్ మహాసభలు ఒంగోలు టీటీడీ కళ్యాణమండపంలో ఆదివారం ప్రారంభమయ్యాయి. అంతకుముందు ఒంగోలు నగర వీధుల్లో ఉపాధ్యాయులు నినాదాలు చేసుకుంటూ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జాతీయ జెండా, ఉపాధ్యాయ జెండాలను ఎం.వెంకటేశ్వరరెడ్డి, కె.శ్రీనివాసరావు, ఓ.వి.వారారెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే దామచర్ల జనార్ధనరావు హాజరై ఉపాధ్యాయుల సమస్యలకు ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి అత్తోట కిరణ్‌కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు బాధ్యతలతో విద్యాబోధన చేయాలని, సమాజం పట్ల బాధ్యతతో ఉండాలన్నారు. స్వర్ణోత్సవాలు సందర్భంగా జిల్లా స్ధాయిలో ఆటల పోటీలు, సాంస్కృతిక పోటీల్లో పాల్గొని విజేతలైన ఉపాధ్యాయులకు బహుమతులు ప్రదానం చేశారు. మొదటి రోజు స్వర్ణోత్సవ మహాసభను జయప్రదం చేసిన కార్యకర్తలందరికీ యూటీఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు ఓ.వి.వీరారెడ్డి, డి.వీరాంజనేయులు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో నగర మేయర్ గంగాడ సుజాత, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, యూటీఎఫ్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కబడ్డీ అసోసియేషన్ జిల్లా కార్యవర్గం ఎన్నిక
మార్కాపురం టౌన్: కబడ్డీ అసోసియేషన్ ఉమ్మడి ప్రకాశం జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక, సర్వ సభ్య సమావేశం ఆదివారం స్థానిక డ్వాక్రా బజార్‌లో స్టేట్ సెక్రటరీ పి.పద్మజబాల ఆధ్వర్యంలో నిర్వహించారు. అసోసియేషన్ నూతన అధ్యక్షునిగా డి.దుర్గేష్‌రెడ్డి, చైర్మన్‌గా ఎం.శ్రీకాంత్, సెక్రటరీగా సీహెచ్ పుల్లయ్య, ఉపాధ్యక్షునిగా సిద్ధం శివరాంప్రసాద్, జాయింట్ సెక్రటరీగా జీ.సతీష్‌బాబు, వైస్ ప్రెసిడెంట్‌గా యం.కోటేశ్వరరావు, వెంకయ్యనాయుడును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కె.రోహిత్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment