ఆపదలో ఆదుకోవడమే మన నైజం
మద్దిపాడు: తోటి వారు ఆపదలో ఉంటే ఆదుకోవడమే మన నైజమని, మన పక్కన ఉండే వారి హితం కోరేవాడు రెడ్డి అవుతారని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. మల్లవరం రిజర్వాయర్ దగ్గర రెడ్డి జనాభ్యుదయ సంఘం ఏర్పాటు చేసిన కార్తీక వనభోజన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ తాను ఐఏఎస్ అధికారి అవ్వాలని డిగ్రీ అయిపోయిన తర్వాత వెంటనే గ్రూప్ వన్ కోచింగ్ కి వెళ్లానని, రెడ్డి జన అభ్యుదయ సంఘం పేద విద్యార్థులకు ఏర్పాటు చేసిన హాస్టల్లోనే తాను ఉంటూ చదువుకుంటానని తన తండ్రికి చెప్పానని తెలిపారు. రెడ్డి సామాజికవర్గంలో పలువురు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారని, వారందరికీ సహాయపడతానని హామీ ఇచ్చారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ రెడ్డి అంటే రక్షించేవాడని, తన వెంట ఉన్న ప్రజలను రక్షిస్తూ సమాజానికి సేవ చేసేవాడని అన్నారు. సామాజికవర్గ సంక్షేమానికి రెడ్డి జనాభ్యుదయ సంఘం విశేషమైన కృషి చేస్తుందని అభినందనలు తెలిపారు. అదే క్రమంలో పేద విద్యార్థులకు ఒంగోలులో హాస్టల్ వసతి ఏర్పాటు చేసి వారి అభ్యున్నతికి కృషి చేయడం అభినందనీయం అన్నారు. అందరినీ అభివృద్ధి పథంలో నడిపిస్తూ అందరి బాగోగులు గమనించడమే రెడ్డి లక్షణంగా ఉంటుందని, రెడ్డి కులం ఇతరులకు సహాయపడే నైజాన్ని కలిగి ఉంటుందని అన్నారు. ముందుగా సంఘం ఆధ్వర్యంలో చిన్నారులు నృత్య ప్రదర్శన నిర్వహించారు. చిన్నారులు, మహిళలకు ఆటలు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించారు. అందరికీ కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమ ఏర్పాట్లను రెడ్డి జనాభ్యుదయ సంఘం అధ్యక్షుడు మురళీధర్ రెడ్డి, కార్యదర్శి లింగారాం కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వైభవోపేతంగా నిర్వహించారు. కార్యక్రమంలో బన్నీ, వెంకటేశ్వర్ రెడ్డి, జనాభ్యుదయ సంఘం ట్రెజరర్ కొత్త సీనా రెడ్డి వెంకటరెడ్డి, గౌరవ సలహాదారులు రామసుబ్బారెడ్డి, నరసింహారెడ్డి, కార్యనిర్వాహక సభ్యుడు జి చంద్రారెడ్డి, ఆర్ సుధాకర్ రెడ్డి, వనమా సుబ్బారెడ్డి, నార్నే వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అందరి హితం కోరేదే రెడ్డి సామాజికవర్గం వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment