అందని భరోసా
నెలలు గడుస్తున్నా భరోసా ఏదీ..
గత ఐదు సంవత్సరాలుగా మత్స్యకార భరోసా రూ.10 వేలు మత్స్యకారులకు సకాలంలో అందింది. ఈ ఎన్నికల్లో చంద్రబాబు వేట నిషేధ భత్యం రూ.20 వేలు ఇస్తామని ప్రకటించారు. కానీ వేట నిషేధకాలం ముగిసి నెలలు గడుస్తున్నా మత్స్యకార భరోసాకు సంబంధించి ఒక్క ప్రకటన రాలేదు. ఇస్తారో లేదో తెలియదు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. మత్స్యకారులకు భరోసా నగదు త్వరగా ఇవ్వాలని కోరుకుంటున్నా.
– తంబు ఆదినారాయణ,
బేసిన్‌పల్లెపాలెం, ఊళ్లపాలెం
మత్స్యకారులను ఆదుకోండి
ప్రతి సంవత్సరం వేట నిషేధ కాలం పూర్తి కాగానే మత్స్యకార భరోసా ప్రభుత్వం ఇచ్చేది. కానీ ఈసారి టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నెలలు గడుస్తున్నా మత్స్యకార భరోసా ఇవ్వలేదు. చేపల వేట కూడా ఆశాజనకంగా లేదు. భరోసా మొత్తం ఇచ్చి మత్స్యకారులను ఆదుకోవాలి.
– తంబు రఘురామయ్య,
బేసిన్ పల్లెపాలెం, ఊళ్లపాలెం
కొత్త ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదు
ప్రతి సంవత్సరం వేట నిషేధ కాలం పూర్తి కాగానే మత్స్యకార భరోసా ప్రభుత్వం ఇచ్చింది. కానీ ఈసారి టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మత్స్యకార భరోసా పై ఎటువంటి ప్రకటన చేయలేదు.
– కొండూరి పౌల్, క్రాంతినగర్, పాకల
నిత్యం కడలితో సహవాసం చేస్తూ.. నడి సంద్రాన ఆశల వల విసురుతూ బతుకుపోరు సాగించే మత్స్యకారులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇచ్చే మత్స్యకార భరోసా నగదు ఈ ఏడాది ఇంత వరకు వారికి అందలేదు. గత ప్రభుత్వానికన్నా రెట్టింపు నగదు ఇస్తామని హామీలు గుప్పించి గద్దెనెక్కిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చి ఐదు నెలలైనా దానిపై ఎటువంటి ప్రకటన చేయలేదు. దీంతో వేలాది మంది మత్స్యకారులు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
సింగరాయకొండ: సముద్రంలో వేటే జీవనాధారంగా బతికే మత్స్యకారులు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, సముద్రంలో కలుస్తున్న రొయ్యల చెరువుల రసాయనిక వ్యర్థాలు, తమిళనాడు రాష్ట్రం కడలూరు ప్రాంతానికి చెందిన సోనాబోట్లు తీరంలో వేటాడటం తదితర కారణాలతో చేపల వేట నిరాశాజనకంగా ఉంది. ఏటా ప్రభుత్వం చేపల ఉత్పత్తి కోసం గుడ్లు పెట్టే సీజన్ అయిన ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేట నిషేధం అని ప్రకటించింది. వేట నిషేధ కాలానికి ఆర్థిక భరోసాగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.10 వేలు ఇవ్వగా, ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం రూ.20 వేలు ఇస్తానని ఎన్నికల్లో వాగ్దానం చేసింది. దీంతో మత్స్యకార భరోసా ఎప్పుడు ఇస్తారోనని 5 నెలలుగా మత్స్యకారులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.
అర్హుల జాబితా సిద్ధంగా ఉన్నా..
జిల్లాలో 5 మండలాల పరిధిలో మత్స్యకారులు చేపల వేట సాగిస్తున్నారు. మత్స్యకారుల్లో 50 ఏళ్లు పైబడిన వారికి ప్రభుత్వం పింఛన్ పథకం కింద ప్రతినెలా ఆర్థిక సహాయం అందజేస్తుండగా.. మిగిలిన 50 ఏళ్లలోపు మత్స్యకారులకు ప్రభుత్వం మత్స్యకార భరోసా ఇస్తోంది. జిల్లాలో 5,459 మంది మత్స్యకార భరోసా కింద అర్హులుగా ఆయా మండలాల మత్స్యశాఖాధికారులు ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే జాబితా సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపారు. ఆ ప్రకారం కొత్తపట్నం మండలంలో 3,113 మంది, నాగులుప్పలపాడు మండలంలో 307 మంది, ఒంగోలు మండలంలో 502 మంది, సింగరాయకొండ మండలంలో 1,440 మంది, టంగుటూరు మండలంలో 97 మంది భరోసాకు అర్హులని జాబితా సిద్ధం చేశారు.
వేట నిషేధ భత్యం కోసం ఎదురుచూపులు:
వేట నిషేధకాలం పూర్తయి నెలలు గడుస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, మత్స్యశాఖా మంత్రి ఏ ఒక్కరూ వేట నిషేధ భత్యం ఎప్పుడు ఇస్తామో ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. క్యాబినెట్ సమావేశంలో అయినా వేట నిషేధ భత్యంపై చర్చిస్తారని ఆశించిన మత్స్యకారులకు నిరాశే మిగిలింది. చివరికి ఇటీవల ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో కూడా అరకొర నిధులే కేటాయించారు. దీంతో అసలు వేట నిషేధ భత్యం ఇస్తారా? ఒకవేళ ఇస్తే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఇచ్చినట్లు రూ.10 వేలు ఇస్తారా, లేక టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు రూ.20 వేలు ఇస్తారా అన్న దానిపై స్పష్టత రావటం లేదు. ప్రభుత్వ పనితీరు చూస్తుంటే ఈ ఆర్థిక సంవత్సరానికి భరోసా పథకానికి మంగళం పాడేటట్లు ఉందని మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చివరికి ఈనెల 21వ తేదీ ప్రపంచ మత్స్యకార దినోత్సవం రోజైనా ఇస్తారని ఆశించామని అది కూడా నిరాశే మిగిలిందని ఆవేదన చెందుతున్నారు. గతంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మత్స్యశాఖ అధికారులు సిద్ధం చేసిన జాబితా ప్రకారం మత్స్యకార భరోసా రూ.10 వేలు ఇచ్చింది. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం అర్హులందరికీ భరోసా ఇస్తామని, లబ్ధిదారుల జాబితాను మళ్లీ సిద్ధం చేయాలని సుమారు ఐదు నెలల క్రితం మత్స్యశాఖా మంత్రి అచ్చెంనాయుడు టెలికాన్ఫరెన్స్‌లో ఆ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు తప్ప ఇంత వరకు జాబితా తయారీకి అవసరమైన మార్గదర్శకాలు ఇవ్వలేదు. దీనిని బట్టి ఈ సంవత్సరం భరోసా అటకెక్కినట్లేనని అధికారులు అంటున్నారని మత్స్యకారులు వాపోతున్నారు. వేట నిషేధ భత్యం రాక, చేపల వేట సక్రమంగా సాగక, సోనాబోట్ల కారణంగా వలలు తెగిపోయి లక్షలాది రూపాయలు నష్టపోతున్నామని, మరో పక్క ఉపాధి పనులు కూడా లేవని.. పెరిగిన నిత్యావసర ధరలు, కూరగాయల ధరలతో బతుకు భారమైందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మత్స్యకార భరోసాపై నీలి నీడలు జిల్లాలో 5,459 మంది ఎదురుచూపులు గత ఐదేళ్లు సమయానికి అందుతున్న భరోసా ఈసారి అనుమానమే అంటున్న మత్స్యకారులు భరోసా రూ.20 వేలు ఇస్తామన్న కూటమి ప్రభుత్వం చేపల వేట సరిగా లేక ఇబ్బంది పడుతున్న మత్స్యకారులు
సక్రమంగా సాగని చేపల వేట
ప్రకృతి వైపరీత్యాలు, సోనాబోట్ల తాకిడితో కొద్ది నెలలుగా చేపల వేట ఆశాజనకంగా లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఐదున్నర నెలల కాలంలో కేవలం నెలరోజులు మాత్రమే చేపల వేట సక్రమంగా సాగిందని మత్స్యకారులు చెబుతున్నారు. సుమారు 2 నెలల పాటు ప్రకృతి వైపరీత్యాలతో చేపల వేటకు వెళ్లొద్దని ఆంక్షలు విధించగా, మిగిలిన రోజులు వేటకు వెళితే డీజిల్ ఖర్చులు కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment