సాక్షి, రంగారెడ్డిజిల్లా: మరో వారం, పది రోజుల్లో ఎన్నికలకు నగరా మోగనుంది. అధికారపార్టీ ఇప్పటికే అభ్యర్థిత్వాలను ఖరారు చేసి ప్రచారపర్వంలోకి అడుగిడగా.. టికెట్లు దక్కని అసంతృప్త నేతలను బుజ్జగించే పర్వం సైతం అదేస్థాయిలో చేస్తోంది. ఇక విపక్ష కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను కొలిక్కి తెచ్చి.. ఏఐసీసీ గ్రీన్‌సిగ్నల్ కోసం ఎదురు చూస్తోంది. భారతీయ జనతాపార్టీ దరఖాస్తులను ఆహ్వానించి.. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను అంతర్గతంగా వడపోస్తోంది. టికెట్ల కేటాయింపు ఆయా పార్టీలకు పెద్ద తలనొప్పిగా మారింది. మునుపెన్నడూలేని రీతిలో టికెట్ల కోసం పోటీ పెరగడం.. అర్థ, అంగబలం ఉండడంతో టికెట్లు దక్కని ఆశావహులను ఎలా బుజ్జగించాలనే అంశంపై అధిష్టానాలు తలపట్టుకుంటున్నాయి.
కాంగ్రెస్‌లో ‘కొత్త’ కలకలం
మహేశ్వరం కాంగ్రెస్ టికెట్ కేటాయింపు అంశం ఆ పార్టీలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అభ్యర్థి పేరు ఇప్పటి వరకు అధికారికంగా వెల్లడించకపోయినా.. ఎవరికి వారు తమకే టికెట్ వస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు. టికెట్ల కేటాయింపులో డబ్బు కీలకంగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షాత్తు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిపైనే ఆరోపణలు రావడం విశేషం. ఇప్పటికే ఎమ్మెల్యే టికెట్ వచ్చిందని చెప్పుకొంటున్న ఓ అభ్యర్థి నుంచి రూ.10 కోట్లు, ఐదెకరాల భూమి రేవంత్ తీసుకున్నట్లు ప్రచారం జరగడం.. ఇదే అంశంపై కొత్త మనోహర్‌రెడ్డి తన అసంతృప్తిని వెల్లగక్కడం.. ఆ మరుక్షణమే ఆయనపై పార్టీ వేటు వేయడం.. భాగ్యలక్ష్మి అమ్మ వారిపై ప్రమాణం చేసి నిజాయితీ నిరూపించుకోవాల్సిందిగా ఆయన రేవంత్‌కు సవాల్ విసరడం చర్చనీయాంశమైంది.
బీజేపీలో ‘కొండా’ దుమారం
బీఆర్‌ఎస్‌ను వీడి..బీజేపీలో చేరిన చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు పార్టీని ఇరకాటంలోకి నెట్టాయి. ఈ అంశంపై పార్టీ పెద్దలు ఆయనపై గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. పార్టీ అంతర్గత అంశాలు.. ఆయన మీడియా ముఖంగా మాట్లాడటం ఇది రెండోసారి. కవితను అరెస్టు చేయకపోవడంతో బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటేననే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయని, ప్రజల్లో బీజేపీపై నమ్మకం సన్నగిల్లిందని, తెలంగాణలో అధికారంలోకి రావడం కష్టమేనని ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ పెద్దలకు ఆగ్రహం తెప్పించినట్టు సమాచారం. అప్పటి వరకు.. ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, కల్వకుర్తి, శేరిలింగంపల్లి నియోజక వర్గాల్లో బీఆర్‌ఎస్‌కు దీటుగా కనిపించిన బీజేపీ గ్రాఫ్.. అటు జాతీయ స్థాయిలో, ఇటు రాష్ట్ర స్థాయిలో తాజాగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు, కొంతమంది నేతల వ్యవహారశైలితో మరింత దిగజారినట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక్కడ టికెట్లు దక్కని ఆశావహులు ఇతర పార్టీల్లోకి వెళ్లే అవకాశం లేకపోలేదు. ఎన్నికల గడువు సమీపిస్తున్నప్పటికీ నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల పేర్లను ప్రకటించకపోవడం.. ఎన్నికల్లో పార్టీ వ్యూహం ఏమిటో అర్థం కాని పరిస్థితి తలెత్తడంతో కేడర్ అయోమయానికి గురవుతోంది.
బీఆర్‌ఎస్‌లో ‘కసిరెడ్డి’ కలవరం
అధికార బీఆర్‌ఎస్‌లోనూ అసంతృప్తి జ్వాల ఇప్పటికీ రగులుతూనే ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ టికెట్లు ఇవ్వనున్నట్లు అధిష్టానం ప్రకటించిన నేపథ్యంలో అధిష్టానం నిర్ణయంపై ఆశావహులు తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు. చేవెళ్లలో సిట్టింగ్ ఎమ్మెల్యే కాలె యాదయ్యకు మళ్లీ టికెట్ ఇవ్వడంపై మాజీ ఎమెల్యే రత్నం మండిపడ్డారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఎల్బీనగర్‌లో సీనియర్ నేత ముద్దగోని రామ్మోహన్‌గౌడ్ తిరుగుబావుటా ఎగరేశారు. ఈసారి ఎన్నికల్లో ఆయన భార్య లక్ష్మి పోటీకి దిగుతున్నట్లు ప్రకటించారు. ఇబ్రహీంపట్నంలో సీనియర్ నేత క్యామ మల్లేశం కినుక వహించారు. ఆయన కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలు, ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ఇక కల్వకుర్తిలో సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కు వ్యతిరేకంగా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పావులు కదిపారు. ఈ క్రమంలో ఆయనపై అనేక ఆరోపణలు కూడా చేశారు. చివరికి మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకుని నచ్చజెప్పినా.. ఆయన వినలేదు. తన అనుచరులతో కలిసి పార్టీని వీడేందుకే సిద్ధమయ్యారు. రెండు మూడు రోజుల్లో ఆయన కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment