చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి అస్త్రసన్యాసం! | Sakshi
Sakshi News home page

చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి అస్త్రసన్యాసం!

Published Tue, Mar 12 2024 8:55 AM

మాజీ సీఎం కేసీఆర్‌తో సమావేశమైన ఉమ్మడి జిల్లా నేతలు - Sakshi

సాక్షి, రంగారెడ్డిజిల్లా: చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి అస్త్రసన్యాసం చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేదిలేదని తెగేసి చెప్పారు. దీంతో గులాబీ అధిష్టానం పునరాలోచనలో పడింది. సిట్టింగ్‌ ఎంపీ పోటీకి వెనుక డుగు వేయడంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది. ఆఖరికి ఎన్నికల వేళ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్‌ అభ్యర్థిత్వానికి మొగ్గు చూపింది. ఇదే విషయాన్ని సోమవారం జరిగిన నియోజకవర్గ నేతల సమావేశంలో గులాబీ బాస్‌ కేసీఆర్‌ ప్రకటించారు. శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తొలుత చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం సమీక్షా సమావేశం ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ అధిష్టానం.. సిట్టింగ్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి మరోసారి బరిలో ఉంటారని ప్రకటించింది. కొన్నాళ్లు ఆయన ప్రచారం కూడా నిర్వహించారు.

అనంతరం జరిగిన పరిణామాలు ఆయనను పునరాలోచనలో పడేశాయి. మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి దంపతులు హస్తం గూటికి చేరడం.. పలువురు దిగువశ్రేణి నాయకులు కారు దిగడం.. ఆత్మరక్షణలో పడేసింది. దీనికితోడు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న మోదీ హవా.. బీజేపీ బలమైన అభ్యర్థిని రంగంలోకి దించడం సైతం ఆయన వెనుకడుగుకు దారితీసింది. మరోవైపు కొందరు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డిని కలుసుకోవడం.. పైకి మాత్రం మర్యాదపూర్వకమేనని చెబుతున్నా.. అంతర్గతంగా కాంగ్రెస్‌కు సహకరిస్తారనే ప్రచారం కూడా రంజిత్‌ను గందరగోళంలోకి నెట్టింది. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈసారి పోటీకి దూరంగా ఉండడమే మేలనే అభిప్రాయానికి వచ్చిన ఆయన కొన్నాళ్లుగా మౌనముద్ర దాల్చారు.

ఈ పరిణామాలతో ఆత్మరక్షణలో పడ్డ బీఆర్‌ఎస్‌ హైకమాండ్‌ రంజిత్‌ వెనుకడుగుతో ప్రత్యామ్నాయంగా పలువురు పేర్లను పరిశీలించింది. మొదట మండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్‌ పేరు పరిశీలించినా ఆయన నిర్ణయంపై స్పష్టత రాకపోవడంతో మాజీ మంత్రి సబితారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి పేర్లు తెరమీదికి వచ్చింది. ఆయన కూడా ఆసక్తి చూపలేదని తెలిసింది. ఆ తర్వాత జెడ్పీ మాజీ చైర్మన్‌ కాసాని జ్ఞానేశ్వర్‌ అభ్యర్థిత్వంపై మొగ్గు చూపింది. ఆయన కాకపోతే కనీసం కుమారుడు వీరేశ్‌నైనా రంగంలోకి దించాలని గులాబీ దళపతి భావించారు. దీనిపై కాసానితో సంప్రదించిన అధిష్టానం ఎట్టకేలకు ఆయ నను పోటీకి ఒప్పించింది. ఇదే విషయాన్ని సోమ వారం జరిగిన సమావేశంలో పార్టీ నేతలకు స్పష్టం చేసింది.

నిధుల కోసమే కలిశాం..
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డిని కలవడంపై కూడా సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిసింది. నియోజకవర్గం అభివృద్ధి నిధుల అంశంపైనే తామంతా సీఎంను కలవాల్సి వచ్చిందని.. ఇందులో రాజకీయ కోణం లేదని వారు వివరణ ఇచ్చినట్లు సమాచారం. సమావేశంలో మాజీ మంత్రి సబితారెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌, మాజీ ఎమ్మెల్యేలు పైలెట్‌ రోహిత్‌రెడ్డి, మహేశ్‌రెడ్డి, మెతుకు ఆనంద్‌ సహా యువ నేతలు కార్తీక్‌రెడ్డి, కాసాని వీరేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement