క్యాంసన్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం
పరిశ్రమలో ఎగిసి పడుతున్న మంటలు
నందిగామ: రంగారెడ్డి జిల్లా నందిగామలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం.. నందిగామ శివారులోని 44వ జాతీయ రహదారి సమీపంలోని సల్వేంద్రిగూడ రోడ్డులో క్యాంసన్ హైజన్‌కేర్ పరిశ్రమ ఉంది. ఇక్కడ డైపర్లు తయారు చేస్తుంటారు. మంగళవారం రాత్రి షిప్టులో సుమారు 40 మంది కార్మికులు పనిచేస్తున్నారు. తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో స్టోర్ రూంలో విద్యుత్‌షార్ట్ సర్క్యూట్ కారణంగా చిన్నగా మంటలు చెలరేగాయి. మంటలు తీవ్రమవుతుండడంతో గమనించిన కార్మికులు భయాందోళనతో బయటకు పరుగు తీశారు. మంటలను ఆర్పేందుకు యత్నించేలోగానే ఒక్కసారిగా పరిశ్రమ మొత్తం నల్లటి పొగతో దట్టమైన మంటలు చెలరేగాయి. దీంతో కార్మికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.
మంటలార్పేందుకు నాలుగు ఫైర్ ఇంజిన్లు
సమాచారం అందిన వెంటనే డీఎఫ్‌ఓ మురళీ మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో షాద్‌నగర్, రాజేంద్రనగర్, శంషాబాద్, మహేశ్వరం ఫైర్ స్టేషన్ల నుంచి నాలుగు ఫైర్ ఇంజిన్లు తెప్పించి మంటలు అదుపులోకి తెచ్చారు. అప్పటికే పరిశ్రమ మొత్తం కాలిబూడిదైంది. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగకపోవడంతో పరిశ్రమ యాజమాన్యం, కార్మికులు ఊపిరి పీల్చుకున్నారు. యంత్రాలు, స్టాకు పూర్తిగా దగ్ధమై రూ.30కోట్ల ఆస్తినష్టం వాటిల్లిందని నిర్వాహకులు తెలిపారు.
మంటలు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు
కాగా ఈ పరిశ్రమ ఆవరణలోని మరో షెడ్డుకు మంటలు వ్యాపించి ఉంటే ఆస్తినష్టం మరింత పెరిగేదని నిర్వాహకులు వాపోయారు. ఓ పక్క ఫైరింజన్లతో మంటలార్పుతూనే ఐదు జేసీబీల సాయంతో ఇనుప వ్యర్థాల తొలగింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న నందిగామ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్, ఎస్‌ఐ గోపాల కృష్ణ చేరుకుని పరిశీలించారు. పరిశ్రమ హెచ్‌ఆర్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పెద్ద ఎత్తున ఎగిసిపడిన మంటలు
క్షణాల్లోనే నేలమట్టమైన పరిశ్రమ
సుమారు రూ.30కోట్ల ఆస్తినష్టం
Comments
Please login to add a commentAdd a comment