మైనార్టీ గురుకులాలకు సొంత భవనాలు
● అందోల్‌లో మినీ స్టేడియం నిర్మాణం
● గాంధీపార్క్‌లో కూరగాయల మార్కెట్
● మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడి
● వట్‌పల్లి మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన మంత్రి
జోగిపేట/వట్‌పల్లి (అందోల్): జోగిపేటలో ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న మైనార్టీ గురుకుల పాఠశాలలకు సొంతంగా భవనాలను నిర్మించేందుకుగాను అవసరమైన నిధులను మంజూరు చేయిస్తానని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి.దామోదర రాజనర్సింహ హామీనిచ్చారు. అందోల్ వద్ద నర్సింగ్ కళాశాల కోసం సిద్ధం చేస్తున్న భవనాన్ని, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను గురువారం ఆయన పరిశీలించారు. అందోల్‌లో భవన నిర్మాణానికి 5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ఆర్డీఓకు ఆదేశించారు. గురుకుల, కస్తూర్భాగాంధీ పాఠశాలలో తరగతులను డిజిటలైజేషన్‌గా మార్చాలని, ఆర్‌వో ప్లాంట్‌లను ఏర్పాటు చేయించాలని, స్వల్ప మరమ్మతులు చేపట్టాలని ఉపాధ్యాయులు మంత్రిని కోరగా ఇందుకు సానుకూలంగా స్పందించారు. సంబంధిత పనులను వెంటనే చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. బాలికలకు సంబంధించిన విద్యాసంస్థలన్నీ ఒకే చోట ఉండాలని, అందోల్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చాలన్నదే తన లక్ష్యమన్నారు. పాలిటెక్నిక్ కళాశాల వద్ద మోడల్ బస్‌షెల్టర్‌ను నిర్మిస్తామన్నారు. 1141 సర్వే నంబర్‌లో మినీ స్టేడియం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి, పంపించాలని అధికారులను ఆదేశించారు.
గాంధీ పార్కులో కూరగాయల మార్కెట్
జోగిపేటలోని గాంధీ పార్కులో కూరగాయల మార్కెట్‌ను ఏర్పాటు చేయాలని అందుకు సంబంధించిన పనులను వెంటనే ప్రారంభించాలని మంత్రి రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట ఆర్‌డీవో పాండు, డీఎస్‌పీ సత్తయ్య గౌడ్, రాష్ట్ర మార్క్‌ఫెడ్ డైరెక్టర్ ఎస్.జగన్మోహన్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ ఎం.జగన్మోహన్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ తిరుపతి, చైర్మన్ మల్లయ్య, వైస్ చైర్మన్ డేవిడ్, కౌన్సిలర్‌లు ఎస్.సురేందర్‌గౌడ్, ఆకుల చిట్టిబాబు, డి.శివశంకర్ తదితరులు ఉన్నారు.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
రాజకీయపార్టీలకతీతంగా అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. గురువారం వట్‌పల్లి మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం అభినందన సభకు జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కర్‌తో కలసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వట్‌పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన లకీ్‌ష్మ్ శేషరెడ్డి, వైస్‌చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఈశ్వర్‌ను పాలకవర్గ సభ్యులకు ఈ సందర్భంగా మంత్రి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...పార్టీ అధికారంలో ఉన్న లేకున్నా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు, ప్రజలకు తాను అండగా ఉండాలని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వారి గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. అల్లాదుర్గం మెటల్ కుంట, జోగిపేట – వట్‌పల్లి, సంగుపేట– పుల్కల్, అందోల్ నియోజకవర్గంలోని,రోడ్ల మరమ్మతు పనులు రూ.152 కోట్లతో త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. వట్‌పల్లిలో నూతన పోలీస్ స్టేషన్ భవనం, మండల కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, మండల మహిళా సమాఖ్య భవనం ఏర్పాటుకు త్వరలో శంకుస్థాపనలు చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment