రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
● జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ● మల్కాపూర్‌లో ధాన్యం కొనుగోలుకేంద్రం పరిశీలన
కొండాపూర్/ సదాశివపేట(సంగారెడ్డి): కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. మండల పరిధిలోని మల్కాపూర్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ గురువారం సందర్శించి అక్కడ ధాన్యం సేకరణ ప్రక్రియను పరిశీలించారు. కొనుగోలు కేంద్రంలో ఉన్న వ్యవస్థను, మౌలిక వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు తమ పంటను రాశుల్ని, ధాన్యంలో తేమ శాతాన్ని పరిశీలించారు. ధాన్యాన్ని నిల్వ చేయడానికి కొత్త గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయా లేదా అని అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
వేగంగా ధాన్యం సేకరణ
లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ వేగంగా కొనసాగుతోందని కలెక్టర్ క్రాంతి పేర్కొన్నారు. ధాన్యం సేకరణ, కొనుగోలు వివరాలను ఓపీఎంఎస్ (ఆన్‌లైన్ పర్చేస్ మానిటరింగ్ సిస్టమ్), లోకల్ యాప్‌లో నమోదు చేయడం వల్ల డిజిటల్ ట్రాకింగ్ సులభమవుతుందన్నారు. సేకరించిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు వెంటనే తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం మండల పరిధిలోని తొగర్‌పల్లి జరుగుతున్న కులగణన కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సర్వేలో ప్రజలు పూర్తి సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
పత్తి కొనుగోళ్లలోఅవకతవకలకు అవకాశమివ్వొద్దు
పత్తి కొనుగోళ్ల ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు అవకాశం ఇవ్వొద్దని కలెక్టర్ వల్లూరు క్రాంతి స్పష్టం చేశారు. గురువారం ఆత్మకూర్ రోడ్డులోని వెంకటేశ్వర కాటన్ మిల్లులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆమె తనిఖీ చేసి, కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... సీసీఐ కొనుగోలు కేంద్రంలో అమ్మని రైతులకు ప్రైవేటు కొనుగోలు కేంద్రాల్లో ఎటువంటి నష్టం జరగకుండా చూడాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment