కాల్చొద్దు.. కలియదున్నేయండి
కోహెడ(హుస్నాబాద్): వరి పంట కోత తర్వాత రైతులు తమ పొలంలోని వరి కొయ్యలను కాలుస్తూ యాసంగి పంటకు సిద్ధం అవుతున్నారు. దాని వల్ల భూసారం దెబ్బతింటుంది. అలాగే అవసరమైన సూక్ష్మజీవులు చనిపోయి దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతోంది. దీనిపై మండల వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలను తెలియజేస్తున్నారు.
భూమిలో పోషకాలకు నష్టం
నిప్పుతో భూసారం దెబ్బతింటుందని, సాగుకు ఉపయోగపడే పోషకాలైన నైట్రోజన్, ఫాస్పరస్, పొటాషియం వంటి పోషకాలు ఆవిరైపోవడంతోపాటు భవిష్యత్‌తో పంట దిగుబడిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అలాగే పొగ ద్వారా వాయు కాలుష్యం పెరుగుతుంది. దాని వల్ల రైతులకు ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు తలెత్తనున్నాయి. నిప్పుతో మట్టిలోని సూక్ష్మజీవులు దెబ్బతిని మట్టి జీవచక్రం అస్తవ్యస్తం కానుంది. నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం తగ్గిపోయి పంటలకు ఎక్కువ నీరు అవసరం అవుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
ఇష్టానుసారంగా వరి కోతలు
హార్వెస్టర్లతో వరికోతలు సాగుతున్నాయి. కంకులను సగం వరకే కోయడంతో కొయ్యకాళ్ల సమస్య తలెత్తుతుంది. దీంతో వాటిని కాల్చడం తప్పడం లేదని రైతులు అంటున్నారు. అదే విధంగా పశుగ్రాసానికి కొరత ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎకరం పొలంలోని పశు గ్రాసానికి రూ.3వేలు చెల్లించి కొనుగోలు చేయడం తప్పడం లేదని వాపోతున్నారు.
భూసార పరీక్షలపై నిర్లక్ష్యం
ఏడాదిలో ఒక్కసారయినా వ్యవసాయ భూముల్లో మట్టి సేకరించి వ్యవసాయ అధికారులు పరీక్షలు చేసిన దాకలాలు లేవు. భూసార పరీక్షలు నిర్వహించి భూమిలో అనుకూలమైన పంట వేయాలని అధికారులు చూచించాలని రైతులు కోరుతున్నారు.
వరి కొయ్యలకు నిప్పు పెడుతున్న రైతులు
దిగుబడి, భూసారంపై తీవ్ర ప్రభావం
అవగాహన కల్పిస్తున్న అధికారులు
Comments
Please login to add a commentAdd a comment