తుది దశకు సమగ్ర సర్వే
● జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ● ఉపముఖ్యమంత్రితో వీడియో కాన్ఫరెన్స్
సంగారెడ్డి జోన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి కుటుంబ సమగ్ర సర్వే నుంచి దశకు చేరుకుందని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. ఆదివారం రాష్ట్ర ఉపముఖ్య మంత్రి భట్టి విక్రమార్క నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ...ఇంటింటి సమగ్ర సర్వే పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే సమగ్ర సర్వే చివరి దశకు చేరుకుందని తెలిపారు. ఎన్యూమరేటర్లు సర్వే వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయాలని సూచించారు. అదేవిధంగా సర్వే వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ లో తప్పులు లేకుండా నమోదు చేయాలని ఆదేశించారు. వలస కుటుంబాలు, డోర్ లాక్ కుటుంబాలను గ్రామాలకు పిలిపించి సర్వే జరుపుతున్నట్లు తెలిపారు. వసతి గృహాల్లో, సంక్షేమ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఇతర జిల్లా ఉన్నతాధికారులు ఆయా మండలాలలో పర్యటించినప్పుడు తరచూ సంక్షేమ వసతి గృహాలను, సంక్షేమ గురుకుల పాఠశాలలను తనిఖీ చేసేలా ఆదేశించినట్లు తెలిపారు. తనిఖీ సమయంలో భోజనం చేసేలా, కిచెన్ షెడ్డు, వంట సామగ్రి పరిశీలించాలని చెప్పారు. అన్ని సంక్షేమ వసతిగృహాలు సంక్షేమ గురుకుల పాఠశాలలో మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో ఎవ రైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవ న్నారు.
Comments
Please login to add a commentAdd a comment