కంది.. కన్నీరు తుడిచేనా!
అంతరపంటల వల్ల లాభమే
రైతులు ఒకే పంట కాకుండా కందిలో అంతర పంటలు వేయాలి. ఒక పంట దెబ్బతింటే మరో పంటతో భర్తీ చేయవచ్చు. ప్రస్తుతం కంది పంట ఆశాజనకంగా ఉంది. వ్యవసాయ అధికారుల సూచన మేరకు సస్యరక్షణ చర్యలు తీసుకొవాలి. నెల రోజుల పాటు పంటను కాపాడుకుంటే మంచి దిగుబడులు వస్తాయి.
–భిక్షపతి, ఏడీఏ, జహీరాబాద్
జహీరాబాద్ టౌన్: ఈ సంవత్సరం తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా జిల్లాలో ఖరీఫ్ సీజన్ పంటలు దెబ్బతిని దిగుబడి పడిపోయింది. కాత పూత దశలో కూడా భారీ వర్షాలు కురడం వల్ల చేతికి వచ్చిన పంటలు వర్షార్పణం అయ్యాయి. పెసర, మినుము పంటలు పూర్తిగా దెబ్బతినగా పత్తి, సోయాబిన్ పంటల దిగుబడిపై ప్రభావం చూపింది. పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితులు లేవు. అయితే కంది పంటకు మాత్రం పరిస్థితులు ఆశాజనకంగా కన్పిస్తున్నాయి. పత్తి, సోయాబిన్, పెసర తదితర పంటల్లో ఏర్పడిన నష్టాన్ని కంది పంట అయినా తీర్చనుందని రైతులు ఆశతో ఉన్నారు. అకాల వర్షాలు కంది పంటకు జీవం పోసింది. ప్రస్తుతం కంది పూత,కాత దశలో ఉంది. వాతావరణం అనుకూలంగా ఉండటంతో రైతులు దిగుబడిపై ఆశలు పెంచుకున్నారు.
మబ్బులతో అప్రమత్తం
వాతవరణంలో ఏర్పడే మబ్బుల వల్ల కంది పంటకు నష్టం కలుగుతుందని, ఆకాశం మేఘావృతమైతే మబ్బులు కమ్మి తెగుళ్లు ఆశిస్తుంటాయని రైతులు ఈ నెలరోజులు పంటను జాగ్రత్తగా కాపాడుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. పూత, కాత దశలోఉన్న కంది పంటలో ఆకు చుట్టూ పురుగులు, మారుకా మచ్చలపురుగు, కాయతొలుచు పురుగు, ఎండు తెగులు, గొడ్డు మోతు తెగులు, రసం పీల్చే పురుగులు, పూత పెంకు పురుగులు, శనగపచ్చపురుగులు ఆశించడంతో దిగుబడిపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయ అధికారులు హెచ్చరిస్తున్నారు.
85,128 ఎకరాల్లో సాగు
జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో సుమారు 7,48,499 ఎకరాల్లో పంటలు సాగు చేసినట్లు వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు. అఽత్యధికంగా సుమారు 3,48,938 ఎకరాల్లో పత్తి పంట వేశారు. సుమారు 85,128 ఎకరాల్లో రైతులు కంది సాగు చేస్తున్నారు. ఎక్కువ మంది అంతర పంటగా కంది వేశారు. మిగతా పంటలతో పొల్చితే కంది పంటలకు వాతావరణం అన్ని రకాలు అనుకూలంగా ఉంది. ప్రస్తుతం పంట ఏపుగా పెరిగి పూత, కాత దశలో ఉంది. ఒకటి రెండు నెలల్లో పంట చేతికి అందే అవకాశం ఉంది. ఈ ఏడాది పంట ఆశాజనకంగా ఉండటంతో ఎకరానికి 9 నుంచి 12 క్వింటాళ్ల వరకు, అంతర పంటలో ఎకరానికి 5 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కంది పంట మద్దతు ధర కూడా పెరగడంతో రైతులకు కొంత ఊరట లభించింది. గతేడాది క్వింటాలుకు రూ.7 వేలు ఉండగా ఈ సంవత్సరం రూ.7,500కి పెరిగింది. దెబ్బతిన్న పంటల కారణంగా ఏర్పడిన నష్టాన్ని కందితో పూడ్చుకొనే అవకాశం రైతులకు కలగనుంది. ఈ నెలరోజులూ కంది పంటకు చాలా కీలకమని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. తెగుళ్లు, పురుగుల ఉధృతి ఎక్కువగా ఉండే సమయం కాబట్టి అప్రమత్తంగా ఉండాలని అధికారు సూచిస్తున్నారు.
ఆశాజనకంగా కంది పైరు
సస్యరక్షణచర్యలతో అధిక దిగుబడులు
పెరిగిన మద్దతు ధరతో రైతులకు ఊరట
Comments
Please login to add a commentAdd a comment