కల్యాణ మండపానికి ముహూర్తం ఎప్పుడో!
రామచంద్రాపురం(పటాన్చెరు): తెల్లాపూర్ మున్సిపాలిటీ కార్యాలయాన్ని ఆనుకుని రూ.కోట్ల వ్యయంతో నిర్మించిన ఆధునిక కల్యాణమండపం ప్రారంభోత్సవానికి నోచుకోవడంలేదు. ఈ కల్యాణ మండపం వినియోగంలోకి వస్తుందా లేదా అన్న అనుమానాలను సైతం స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో పేద, మధ్యతరగతి ప్రజలు శుభకార్యాలను ప్రైవేట్ ఫంక్షన్‌హాళ్లలో నిర్వహించుకోవాలంటే రూ.లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో ఇళ్ల ముందే శుభకార్యాలను జరుపుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
బీఆర్ఎస్ హయాంలో...
కొన్నేళ్లుగా ఇక్కడ కల్యాణమండపాన్ని నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేయడంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో భూమిని సేకరించి రూ.7కోట్ల నిధులను కేటాయించారు. 2023లో నిర్మాణ పనులను ప్రారంభించారు. కల్యాణమండపం నిర్మాణ చివరిదశలో నిధులు తక్కువ కావడంతో మున్సిపల్ పాలకవర్గం తీర్మానం చేసి మరికొన్ని నిధులను కేటాయించారు. మున్సిపల్ పాలకవర్గం పదవీకాలం ముగిసేలోపు దానిని ప్రారంభించుకోవాలన్న లక్ష్యంతో చివరి క్షణంలో నిర్మాణ పనులను వేగవంతం చేసి పూర్తి చేశారు. ప్రారంభోత్సవానికి తేదీని సైతం ఖరారు చేసుకున్న తరుణంలో రాజకీయ ప్రమేయాలతో చివరిక్షణంలో ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు. దీంతో స్థానిక ప్రజలు రాజకీయ నేతలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. వేసవికాలం దగ్గర పడటంతో పెళ్లి ముహూర్తాలు ఎక్కువగా ఉన్నాయని అప్పటికై నా కల్యాణమండపాన్ని అందుబాటులోకి తెస్తారా? లేదా? అనే అనుమానాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.
త్వరలో ప్రారంభించే విధంగా చర్యలు
మున్సిపల్ నిధులతో నిర్మించిన కల్యాణమండపం ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటాం. కల్యాణమండపంలో ఏసీలు, ఫర్నీచర్ ఏర్పాటు చేయాల్సి వుంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి త్వరలో ప్రజలకు అందుబాటులోకి తెచ్చే విధంగా కృషి చేస్తాం.
– సంగారెడ్డి, మున్సిపల్ కమిషన్
Comments
Please login to add a commentAdd a comment