కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే
జహీరాబాద్/సదాశివపేట(సంగారెడ్డి): ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ నిలవబోతుందని ఆపార్టీ రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. జహీరాబాద్ మండలంలోని రంజోల్ గ్రామంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డితో కలసి మాట్లాడారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖతం కావడం ఖాయమని, బీఆర్ఎస్ది ఇక గతమే అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలతో తెలంగాణ భవిష్యత్తు ముడిపడి ఉందని తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలతోనే బీజేపీ అభ్యర్థుల విజయం ఖాయమైపోయిందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ఏడాది కాలంలోనే ఆపార్టీపై వ్యతిరేకత వచ్చిందని తెలిపారు. ప్రతీ వర్షం బొట్టును ఒడిసి పట్టుకుని భూమిలోకి ఇంకింపజేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చనేది గొటిగార్‌పల్లి గ్రామమే ఒక నిదర్శనమని వివరించారు. అంతకుముందు సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని గొటిగార్‌పల్లి గ్రామంలో గత రెండు దశాబ్దాల క్రితం చేపట్టిన వాటర్‌షెడ్ ప్రాంతాన్ని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డిలతో కలసి సందర్శించారు. సమావేశంలో ఎమ్మెల్సీ జనార్ధన్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి, నాయకులు ఎం.జైపాల్‌రెడ్డి, ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సదాశివపేటలో ఘన స్వాగతం
ఎంపీలు లక్ష్మణ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి జహీరాబాద్ వెళ్తుండగా వారికి సదాశివపేట పట్టణ పరిధిలోని బీజేపీ నాయకుడు నెమలికొండ వేణుమాధవ్ ఇతర నాయకులు ఘన స్వాగతం పలికారు.
బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్
Comments
Please login to add a commentAdd a comment