గిరిజన ఆశ్రమ పాఠశాల తనిఖీ
విద్యార్థులకు అందిస్తున్న భోజనంపై ఆరా తీసిన అధికారులు
సంగారెడ్డి: చౌటకూర్ మండలం బొమ్మారెడ్డిగూడెం గిరిజన ఆశ్రమ వసతి గృహంలో నెలకొన్న సమస్యలపై అధికారులు ఆరా తీశారు. వసతిగృహంలో భోజనం బాగోలేదంటూ విద్యార్థులు గత రెండు రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న అందోల్–జోగిపేట ఆర్డీవో పాండు, చౌటకూర్ తహసీల్దార్ మన్నె కిరణ్ కుమార్ మంగళవారం రాత్రి సందర్శించి విద్యార్థులతో కలసి భోజనం చేశారు. కాగా, ఇన్చార్జి ఎంపీడీవో రామలింగం బుధవారం పాఠశాలను సందర్శించారు. భోజన విషయమై అధికారులు విద్యార్థులను అడుగగా, తరచుగా అన్నం మెత్తగా ఉడికించి పెడుతున్నారని తెలిపారు. పలుమార్లు చెప్పినప్పటికీ, ఎలాంటి మార్పు రావడంలేదని విద్యార్థులు వాపోయారు. దీనిపై వంట సిబ్బందిని ఆరా తీయగా... ఉప్పు నీటితో వంట చేస్తుండటంతో అన్నం మెత్తగా ఉడుకుతుందని చెప్పారు. వసతి గృహానికి మంజీర కనెక్షన్ ఉన్నప్పటికీ, నీటి సరఫరా కావడం లేదని, 24 గంటల పాటు మంజీర జలాలు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. జిల్లా గిరిజన సంక్షేమ అధికారి అఖిలేష్రెడ్డి ఇదే పాఠశాలలో రాత్రి బస కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలసి భోజనం చేసి నిద్రించారు.
Comments
Please login to add a commentAdd a comment