గ్రూప్ 3 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
● అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ ● అధికారులతో సమావేశం
సిద్దిపేటరూరల్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 3 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతున్నట్లు అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ తెలిపారు. ఈ నెల 17 నుంచి జరిగే గ్రూప్–3 పరీక్ష నిర్వహణకు సంబంధించి మంగళవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్, రూట్ ఆఫీసర్లు, ఫ్లైయింగ్ స్క్వాడ్, పోలీస్ అధికారులతో అబ్దుల్ హమీద్ సమావేశం నిర్వహించారు. ముందుగా జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్ వీపీ. రాజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 37 సెంటర్లలో 13,408 మంది అభ్యర్థులు గ్రూప్ 3 పరీక్ష రాయనున్నారని అన్నారు. సబ్జెక్ట్‌ల వారీగా మూడు పేపర్లు ఉంటాయన్నారు. 17న ఉదయం 10 నుంచి 12:30వరకు జనరల్ స్టడీస్– జనరల్ అబిలిటీ పేపర్–1, మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 5:30గంటల వరకు హిస్టరీ–సొసైటీ పేపర్–2, 18న ఉదయం 10గంటల నుంచి 12:30 గంటల వరకు ఎకానమీ డెవలప్‌మెంట్ పేపర్–3 పరీక్ష నిర్వహించడం జరుగుతుందని అధికారులకు సూచించారు. అభ్యర్థులకు పరీక్ష సమయానికి అరగంట ముందు అనుమతించి, బయోమెట్రిక్ చేస్తారన్నారు. పరీక్షల సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలన్నారు. పరీక్షా సమయానికి అనుకూలంగా ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment