నేడు హుస్నాబాద్‌లో సాంస్కృతిక కళా ప్రదర్శన
సిద్దిపేటరూరల్: ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాలలో భాగంగా సోమవారం సాయంత్రం హుస్నాబాద్‌లోని అంబేడ్కర్ చౌరస్తాలో సాంస్కృతిక కళాప్రదర్శన నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ మనుచౌదరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరవుతున్నారని, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కళా ప్రదర్శన కోసం ప్రత్యేక వేదికను ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
క్రమశిక్షణతో
భవిష్యత్తుకు బాటలు
అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్
మిరుదొడ్డి(దుబ్బాక): క్రమశిక్షణతో భవిష్యత్తుకు బాటలు పడతాయని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ విద్యార్థులకు సూచించారు. మిరుదొడ్డిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. రికార్డులను, విద్యార్థుల హాజరు, టీచర్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్‌లో విద్యార్థులకు వడ్డిస్తున్న మెనూ తీరును, కిచెన్‌లోని నిత్యావసర సరుకులను, కూరగాయలను పరిశీలించారు. హాస్టల్‌లో నెలకొన్న సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. గుణాత్మకమైన, నాణ్యమైన విద్యను బోధించి వార్షిక పరీక్షల్లో మంచి సత్ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ హరికిషన్, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం స్పెషల్ ఆఫీసర్ స్వర్ణలత, టీచర్లు ఉన్నారు.
నేతాజీ జీవితం స్ఫూర్తిదాయకం
ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి
గజ్వేల్: నేతాజీ సుభాస్ చంద్రబోస్ జీవితం స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు. ఆదివారం గజ్వేల్‌లో సుభాష్ చంద్రబోస్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో పేరుకుపోయిన రుగ్మతల నివారణకు నేటి యువత సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తితో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎన్‌సీ రాజమౌళి, మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, పట్టణ ప్రముఖులు మిన్నకంటి ప్రసాద్, ఉప్పల మెట్టయ్య, మతిన్, డాక్టర్ నరేష్‌బాబు, ఎల్లు రాంరెడ్డి, మనోహర్, ఉప్పల మధు, నిర్వాహకులు పాల్గొన్నారు.
రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే కేసులు పెట్టాలి
హుస్నాబాద్: రాజ్యాంగబద్దమైన పదవుల్లో ఉండి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెట్టాలని అంబేడ్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాశ్ డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో భారత రాజ్యాంగ పరి రక్షణ యాత్ర కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రకాశ్ మాట్లాడుతూ ఈ నెల 26న భారత రాజ్యాంగం దినోత్సవం పురస్కరించుకొని నియోజకవర్గంలో రాజ్యాంగ పరిరక్షణ యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంబేడ్కర్ విగ్రహాల చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆయన పేరిట విజ్ఞాన కేంద్రాలను నెలకొల్పాలన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి సదానందం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చేరాలు, రాష్ట్ర కార్యదర్శులు ఎల్లయ్య, కండె సుధాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి మ్యాక రమేశ్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment