![Afghanistan Batter Bizarre Dismissal vs South Africa Goes Viral](/styles/webp/s3/article_images/2024/09/23/afg.jpg.webp?itok=SnbRGs_5)
PC: X
అఫ్గనిస్తాన్- సౌతాఫ్రికా మధ్య మూడో వన్డే సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అఫ్గన్ బ్యాటర్ రహ్మత్ షా అవుటైన తీరు నెట్టింట వైరల్ అవుతోంది. కాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా అఫ్గనిస్తాన్.. సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడింది.
అనూహ్య రీతిలో తొలి రెండు మ్యాచ్ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. అయితే, నామమాత్రపు మూడో వన్డేలో మాత్రం ప్రొటిస్ జట్టు అఫ్గన్‌పై పైచేయి సాధించింది. ఆతిథ్య జట్టు ఆధిక్యాన్ని 2-1కు తగ్గించింది. షార్జా వేదికగా ఆదివారం జరిగిన చివరి వన్డేలో 7 వికెట్ల తేడాతో అఫ్గనిస్తాన్‌ను చిత్తు చేసింది.
రహ్మనుల్లా గుర్బాజ్ ఒంటరి పోరాటం
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గన్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి.. 34 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (94 బంతుల్లో 89; 7 ఫోర్లుర, 4 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేయగా... ఘజన్‌ఫార్ (15 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) చివర్లో మెరుపులు మెరిపించాడు. రహ్మత్ షా (1), అబ్దుల్ మాలిక్ (9), కెప్టెన్ హష్మతుల్లా (10), అజ్మతుల్లా (2), ఇక్రామ్ (4), నబీ (5) విఫలమయ్యారు.
ఇక సఫారీ బౌలర్లలో ఎంగిడి, పీటర్, ఫెలుక్వాయో తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 33 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఎయిడెన్ మార్క్‌రమ్ (67 బంతుల్లో 69 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉంటే.. అఫ్గన్ ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్‌ను ప్రొటిస్ పేసర్ లుంగి ఎంగిడి వేశాడు.
అప్పుడు రహ్మనుల్లా గుర్బాజ్ క్రీజులో ఉండగా.. రహ్మత్ షా నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో ఎంగిడి ఓవర్‌లో ఐదో బంతికి షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు రహ్మనుల్లా. దీంతో సింగిల్ తీసేందుకు రెడీగా ఉన్న రహ్మత్ అప్పటికే క్రీజు నుంచి బయటకు రాగా.. రహ్మనుల్లా సైతం నాన్ స్ట్రైకర్ ఎండ్‌వైపు పరుగు మొదలుపెట్టాడు.
పాపం.. ఊహించి ఉండడు
అయితే, ఆ కొద్ది సమయంలోనే ఊహించని సంఘటన జరిగింది. రహ్మనుల్లా కొట్టిన బంతిని ఆపేందుకు ఎంగిడి చేయి అడ్డం పెట్టాడు. అయితే, బంతి అతడి చేతికి చిక్కకపోయినా.. చేయిని గీసుకుంటూ.. రహ్మత్‌కు తాకి స్టంప్స్‌ను ఎగురగొట్టింది. ఫలితంగా రహ్మత్ రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది.
ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ‘‘అయ్యో పాపం.. ఇలా అవుటవుతాడని ఊహించి ఉండడు’’ అంటూ క్రికెట్ ప్రేమికులు రహ్మత్ షా(1)ను ఉద్దేశించి కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: కెప్టెన్‌గా రహానే.. జట్టులోకి ఇద్దరు టీమిండియా స్టార్లు!
This is how Rahmat Shah got out Against South Africa ❤️😂😂😂 pic.twitter.com/kw9VSJb9sl
— Sports Production (@SportsProd37) September 22, 2024
Comments
Please login to add a commentAdd a comment