
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు రసవత్తరంగా మారింది. రెండో రోజు ఆటలో ఆసీస్ బౌలర్ల దాటికి ఇంగ్లండ్ బ్యాటర్లు నిలవలేకపోతున్నారు. ముఖ్యంగా కమిన్స్ నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడుతూ ఇంగ్లండ్ భరతం పట్టాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ రెండో సెషన్‌లో 9 వికెట్ల నష్టానికి 212 పరుగులతో ఆడుతుంది. స్టోక్స్ 60 పరుగులతో ఒంటరిపోరాటం చేస్తుండగా.. కమిన్స్ ఆరు వికెట్లతో చెలరేగాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 51 పరుగులు వెనుకబడి ఉంది.
లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో జానీ బెయిర్ స్టో ఔట్ వివాదాన్ని ఇంగ్లండ్ అభిమానులు అంత తొందరగా మరిచిపోయేలా కనిపించడం లేదు. తాజాగా మూడో టెస్టులో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ కేరీకి ఇంగ్లండ్ అభిమానుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. మూడో టెస్టుకు ఆతిథ్యమిస్తున్న లీడ్స్.. జానీ బెయిర్ స్టోకు హోమ్ గ్రౌండ్. కాగా బెయిర్ స్టో ఇలాకాలో ఇంగ్లండ్ అభిమానులు హద్దుమీరి ప్రవర్తించారు.
ఆసీస్ ఆటగాడు అలెక్స్ కేరీని ఉద్దేశించి ఇంగ్లండ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. అలెక్స్ కేరీ ఔటయ్యి పెవిలియన్ వెళ్తున్న సమయంలో ఇంగ్లండ్ అభిమానులు అతన్ని గేలి చేశారు.. ''గుడ్ బై.. ఇక మైదానంలోకి రాకు.. వస్తే ఇలాంటి అనుభవమే ఎదురవుతుంది'' అంటూ చప్పట్లు కొట్టారు. మరి కొంతమంది అభిమానులు తన షూస్ విప్పి చేతిలో పట్టుకొని కేరీ వైపు చూపించారు. దీనికి సంబంధించిన వీడియో కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది.అయితే ఆసీస్ అభిమానులు కూడా కాస్త దీటుగానే స్పందించినట్లు తెలుస్తోంది.
లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టు చివరి రోజు తొలిసెషన్ ఆటలో ఇంగ్లాండ్ 193/5గా ఉన్న సమయంలో.. గ్రీన్ బౌన్సర్‌ను తప్పించుకునేందుకు బెయిర్‌స్టో కిందకు వంగాడు. బంతి వికెట్ కీపర్ కేరీ చేతుల్లోకి వెళ్లింది. ఇంతలో ఓవర్ పూర్తయిందనే ఉద్దేశంతో బెయిర్‌స్టో క్రీజు దాటాడు. వెంటనే వికెట్ కీపర్ అలెక్స్ కేరీ బంతిని కింద నుంచి విసిరి స్టంప్స్ పడగొట్టాడు. బంతి డెడ్ కాలేదని భావించిన థర్డ్ అంపైర్.. బెయిర్‌స్టోను స్టంపౌట్‌గా ప్రకటించాడు. ఇది కాస్తా తీవ్ర దుమారం రేపింది. దీంతో ఆసీస్ ‘క్రీడా స్ఫూర్తి’ ప్రదర్శించలేదని ఇంగ్లాండ్ అభిమానులు విమర్శలు గుప్పించారు. తాము ఐసీసీ నిబంధనల ప్రకారమే ఔట్ చేసినట్లు ఆసీస్ ఆటగాళ్లు, అభిమానులు కౌంటర్ ఇచ్చారు.
The Western Terrace is alive as Alex Carey departs 👋#Ashes pic.twitter.com/t6bWvcQRpF
— England's Barmy Army 🏴🎺 (@TheBarmyArmy) July 6, 2023
“Welcome” Alex Carey pic.twitter.com/tCNv1bKEsY
— Justin it for the Cloutinho (@JUSTIN_AVFC_) July 6, 2023