హెడింగ్లే వేదికగా జులై 6 నుంచి ప్రారంభంకానున్న యాషెస్ సిరీస్ మూడో టెస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్‌కు చిరకాలం గుర్తుండిపోతుంది. ఈ మ్యాచ్‌తో స్మిత్ అరుదైన మైలురాయిని చేరుకుంటాడు. టెస్ట్ క్రికెట్‌లో ఇప్పటివరకు 40 మంది ఆటగాళ్లు 100 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ఘనతను సొంతం చేసుకోగా.. ఎల్లుండి నుంచి ప్రారంభంకాబోయే మ్యాచ్‌తో స్మిత్ వీరి సరసన చేరనున్నాడు.
ఆసీస్ తరఫున ఈ మైలురాయిని గతంలో 14 మంది చేరుకోగా.. స్మిత్ 15వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కానున్నాడు. చిరకాలం గుర్తుండిపోయే తన 100వ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి, మరింత స్పెషల్‌గా మార్చుకోవాలని స్మిత్ భావిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ గెలిస్తే, సిరీస్‌ను సైతం సొంతం చేసుకుంటుంది. స్మిత్ జట్టులోకి వచ్చాక ఆసీస్.. ఇంగ్లండ్‌లో యాషెస్ సిరీస్ గెలిచింది లేదు. దీంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి చిరస్మరణీయంగా మార్చుకోవాలని స్మిత్ అనుకుంటున్నాడు.
కెరీర్‌లో ఇప్పటివరకు 99 టెస్ట్‌లు ఆడిన స్మిత్.. 32 సెంచరీలు, 37 అర్ధసెంచరీల సాయంతో 59.56 సగటున 9113 పరుగులు చేశాడు. తాజాగా ముగిసిన యాషెస్ రెండో టెస్ట్‌లోనూ స్మిత్ సెంచరీ చేశాడు. ప్రస్తుత తరం అత్యుత్తమ ఆటగాళ్లలో ప్రథముడిగా చలామణి అవుతున్న స్మిత్.. వంద టెస్ట్‌లోనూ సెంచరీ చేసి ఫాబ్ ఫోర్‌గా పిలువబడే కోహ్లి, రూట్, విలియమ్సన్‌ల కంటే చాలా స్పెషల్ అని మరోసారి నిరూపించుకోవాలని అతని అభిమానులు ఆరాటపడుతున్నారు.
సెంచరీల పరంగా, యావరేజ్ పరంగా కోహ్లి (28 సెంచరీలు, 48.72 యావరేజ్), రూట్ (30, 50.43)), విలియమ్సన్ (28, 54.89)ల కంటే చాలా మెరుగ్గా ఉన్న స్మిత్.. 100వ మ్యాచ్‌లో సెంచరీ చేసి, ఆల్‌టైమ్ గ్రేట్ అనిపించుకోవాలని వారు ఆశిస్తున్నారు. ఇదిలా ఉంటే, 5 మ్యాచ్‌ల యాషెస్ సిరీస్‌లో పర్యాటక ఆస్ట్రేలియా ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి 2-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ఏదో అద్భుతం జరిగితే తప్ప ఈ సిరీస్‌ను ఇంగ్లండ్ గెలవలేదు. అయినా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాత్రం తాము ఈ సిరీస్‌ను గెలిచి తీరతామని అంటున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment