
రోహిత్ శర్మ- రవిచంద్రన్ అశ్విన్ (PC: BCCI)
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవి చంద్రన్ వన్డే వరల్డ్‌కప్-2023లో ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ గాయపడటంతో అతడికి మార్గం సుగమమయ్యే ఛాన్స్ ఉంది. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఇందుకు సంబంధించి సంకేతాలు ఇచ్చాడు.
కాగా ఆసియా వన్డే కప్-2023లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడిన అక్షర్ పటేల్ ఇంకా కోలుకోలేదు. ఈ క్రమంలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు అతడు దూరమయ్యాడు. తొలి రెండు మ్యాచ్‌లు ఆడలేకపోయినప్పటికీ.. రాజ్‌కోట్ వన్డేకు అందుబాటులోకి వస్తాడనుకుంటే గాయం తీవ్రత దృష్ట్యా కుదరడం లేదని సమాచారం.
ఇక వన్డే వరల్డ్‌కప్ టోర్నీకి మరో ఎనిమిది రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో అక్షర్ గనుక కోలుకోకపోతే అశ్విన్ ప్రపంచకప్ జట్టులో ఎంట్రీ ఇవ్వడం ఖాయమే!
సుదీర్ఘ కాలం తర్వాత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌తో పునరాగమనం చేసిన అశ్విన్.. రెండు మ్యాచ్‌లలో కలిపి 4 వికెట్లు తీశాడు. వన్డేల్లోనూ సత్తా చాటగలనని నిరూపించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆసీస్‌తో నామమాత్రపు మూడో వన్డేకు ముందు మీడియాతో మాట్లాడిన కెప్టెన్ రోహిత్ శర్మకు అశూ గురించి ప్రశ్న ఎదురైంది.
ఇందుకు బదులుగా.. ‘‘అతడు క్లాస్ బౌలర్. ఒత్తిడిని అధిగమించి ఎలా ఆడాలో తెలిసిన అనుభవజ్ఞుడు. గతేడాది కాలంగా వన్డేలు ఆడనప్పటికీ గత రెండు మ్యాచ్‌లతో తన బౌలింగ్ స్థాయి ఏమిటో చాటిచెప్పాడు. అతడి బౌలింగ్‌లో వైవిధ్యం ఉంటుంది.
వన్డే వరల్డ్‌కప్‌నకు ముందు మాకు అన్నీ సానుకూలాంశాలే కనిపిస్తున్నాయి. మా బ్యాకప్ ప్లేయర్లందరూ సంసిద్ధంగా ఉండటం సంతోషంగా ఉంది’’ అని రోహిత్ సమాధానమిచ్చాడు. కాగా సెప్టెంబరు 28 వరకు ప్రపంచకప్ జట్టులో మార్పులకు అవకాశం ఉన్న నేపథ్యంలో రోహిత్ మాటల్ని బట్టి అశ్విన్ ప్రపంచకప్ ఆడే ఛాన్స్ ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు.. అక్షర్ ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్న విషయం తెలిసిందే. ఇక అక్టోబరు 5 నుంచి ఐసీసీ టోర్నీ ఆరంభం కానుండగా.. 8న ఆస్ట్రేలియాతో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది.
Comments
Please login to add a commentAdd a comment