Ashwin Fires Outright 'Jaiswal' Warning To West Indies After Record-Fest Outing In 1st Test - Sakshi
Sakshi News home page

Ind Vs WI: అతడొక అద్భుతం... చురుకైన, తెలివైన ఆటగాడు: అశ్విన్‌ ప్రశంసల జల్లు

Published Thu, Jul 13 2023 5:25 PM | Last Updated on Thu, Jul 13 2023 5:47 PM

Ashwin Outright Jaiswal Warning To West Indies After Record Fest Outing - Sakshi

West Indies vs India, 1st Test: వెస్టిండీస్‌తో విండ్సర్ పార్క్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు తొలి రోజు భారత జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన విషయం తెలిసిందే. మొదట బౌలింగ్‌తో ఆకట్టుకున్న టీమిండియా, ఆ తర్వాత బ్యాటింగ్‌లో కూడా రాణించింది. టాస్ ఓడి బౌలింగ్‌కు దిగిన రోహిత్‌ సేనకు వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐదు వికెట్లు తీసి కరేబియన్ జట్టును కోలుకోలేని దెబ్బతీశాడు.

అశ్విన్కు తోడు మరో స్పిన్నర్ రవీంద్ర జడేజా కూడా మూడు వికెట్లతో రాణించాడు. దాంతో విండీస్ తన తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 150 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్ ద్వారా అశ్విన్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టుకు ఓపెనర్లు రోహిత్ శర్మ, అరంగేట్ర మ్యాచ్ ఆడుతున్న యశస్వి జైస్వాల్‌ శుభారంభం ఇచ్చారు.

దీంతో భారత జట్టు మొదటి రోజు ఆట ముగిసేసమయానికి వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్‌ శర్మ (30), జైస్వాల్ (40) ఉన్నారు. ఇదిలాఉంటే.. తొలి టెస్టు మ్యాచ్ ఆడుతున్న యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్‌పై అశ్విన్ ప్రశంసల వర్షం కురిపించాడు. యశస్వి ఇన్నింగ్స్ ఆతిథ్య జట్టుకు వార్నింగ్ లాంటిదని అన్నాడు. అతడు చురుకైన ఆటగాడని పేర్కొన్నాడు. తొలి మ్యాచ్‌లోనే ఇంత అద్భుతంగా బ్యాటింగ్ చేయడం నిజంగా చాలా బాగుందని తెలిపాడు.

యశస్వి చురుకైన, తెలివైన ఆటగాడు
"యశస్వి జైస్వాల్‌ చురుకైన, తెలివైన ఆటగాడు. అతని కెరీర్‌లో ఎన్నో ఘనతలు సాధించగలడని నమ్ముతున్నాను. అతని నుంచి భవిష్యత్‌లో మనం చాలా గొప్ప ప్రదర్శనలను చూడబోతున్నాం." అని అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. అతడి భవిష్యత్తు దేదీప్యమానంగా వెలిగిపోతుందనే నమ్మకం ఉందన్నాడు.

ఇక యశస్వి కూడా ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ 16వ సీజన్‌లో రాణించడంతో పాటు గత కొంతకాలంగా దేశవాళీ క్రికెట్‌లో నిలకడైన ప్రదర్శనతో టీమిండియా సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. దాంతో ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన ఐసీసీ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఆడే భారత జట్టులో స్థానం సంపాదించాడు. కానీ, తుది జట్టులో చోటు దక్కకపోవడంతో బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది.

అయితే, విండీస్‌ టూర్‌కు మరోసారి సెలక్టర్లు యశస్వీని ఎంపిక చేయడం అతడికి కలిసొచ్చింది. అరంగేట్రం మ్యాచ్‌లోనే ఏకంగా ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. అంతేనా.. ఆడిన తొలి ఇన్నింగ్స్‌లోనే నాణ్యమైన క్రికెట్‌ ఆడి సెలక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టాడు. 73 బంతులు ఎదుర్కొన్న యశస్వీ 40 పరుగులతో నాటౌట్‌గా క్రీజులో ఉన్నాడు. రెండో రోజు కూడా రాణించి 40 పరుగులను అర్ధశతకం, శతకంగా మారిస్తే అతడి కెరీర్‌కి శుభారంభం లభించినట్లవుతుంది. 

చదవండి: Ind Vs WI: మనం తప్పు చేశామా అని పశ్చాత్తాపపడేలా చేశాడు! తొలిరోజే 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement