IND VS PAK: ఆపద్బాంధవుడు హార్ధిక్‌ పాండ్యా..! | Asia Cup 2023 IND VS PAK: Hardik Pandya Played Many Crucial Innings When Team Is In Need | Sakshi
Sakshi News home page

Hardik Pandya: ఆపద్బాంధవుడు హార్ధిక్‌ పాండ్యా..!

Published Sat, Sep 2 2023 8:47 PM | Last Updated on Sat, Sep 2 2023 9:18 PM

Asia Cup 2023 IND VS PAK: Hardik Pandya Played Many Crucial Innings When Team Is In Need - Sakshi

ఆసియా కప్‌-2023లో భాగంగా పల్లెకెలె వేదికగా పాకిస్తాన్‌తో ఇవాళ (సెప్టెంబర్‌ 2) జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యా (90 బంతుల్లో 87; 7 ఫోర్లు, సిక్స్‌) ఆపద్బాంధవుడి పాత్ర పోషించాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు (66/4) ఐదో వికెట్‌కు ఇషాన్‌ కిషన్‌ (81 బంతుల్లో 82; 9 ఫోర్లు, 2 సిక్సర్లు)తో కలిసి 138 పరుగుల అతి కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేసి, టీమిండియా ఓ మోస్తరు స్కోర్‌ చేయడానికి దోహదపడ్డాడు.

ఈ మ్యాచ్‌లో ఇషాన్‌, పాండ్యాలు రాణించకుండా ఉండివుంటే టీమిండియా 150 పరుగులలోపే బిచానా ఎత్తేసేది. పాక్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడం పాండ్యాకు ఇది కొత్తేమీ కాదు. గతంలో చాలా సందర్భాల్లో ఇలాంటి ఇన్నింగ్స్‌లే ఆడి జట్టును గట్టెక్కించాడు. అప్పుడప్పుడు బంతితోనూ మ్యాజిక్‌ చేసి, జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. 

గతంలో పాక్‌పై పాండ్యా ఆడిన కీలక ఇన్నింగ్స్‌లపై ఓ లుక్కేస్తే అన్ని జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు సాధించినవే కావడం విశేషం. 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా 72 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగిన పాండ్యా 43 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 76 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి, జట్టు మూడంకెల స్కోర్‌ చేయడానికి సాయపడ్డాడు. అయితే ఆ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది. 2022 ఆసియా కప్‌లోనూ హార్దిక్‌ ఛేదనలో మెరుపు ఇన్నింగ్స్‌ (17 బంతుల్లో 33 నాటౌట్‌; 4 ఫోర్లు, సిక్స్‌) ఆడి, జట్టును గెలిపించాడు. 

అలాగే 2022 టీ20 వరల్డ్‌కప్‌లోనూ కోహ్లితో కలిసి అతి కీలక ఇన్నింగ్స్‌ (37 బంతుల్లో 40; ఫోర్‌, 2 సిక్సర్లు) ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. తాజా ఆసియా కప్‌లోనూ హార్ధిక్‌ అలాంటి ఇన్నింగ్సే ఆడి జట్టు గౌరవప్రదమైన స్కోర్‌ చేసేందుకు దోహదపడ్డాడు. దాయాదితో మ్యాచ్‌లో సహచరులు ఒత్తిడికి లోనై వికెట్లు పారేసుకున్న చాలా సందర్భాల్లో కుంఫూ పాండ్యా ఆపద్బాంధవుడు పాత్రను పోషించి, జట్టును గట్టెక్కించాడు. 

ఇదిలా ఉంటే, పాక్‌తో జరుగుతున్న నేటి మ్యాచ్‌లో ఇషాన్‌ కిషన్‌, హార్ధిక్‌ పాండ్యా రాణించడంతో టీమిండియా 266 పరుగులకు ఆలౌటైంది. ఆఖర్లో బుమ్రా (16) కూడా బ్యాట్‌కు పనిచెప్పడంతో టీమిండియా 250 పరుగుల మార్కు దాటగలిగింది. పాక్‌ బౌలర్లలో షాహీన్‌ అఫ్రిది (4), నసీం షా (3), హరీస్‌ రౌఫ్‌ (3) టీమిండియాను బాగా ఇబ్బంది పెట్టారు. భారత ఇన్నింగ్స్‌ ముగిసాక వర్షం మళ్లీ మొదలుకావడంతో పాక్‌ ఇన్నింగ్స్‌ ఆలస్యమైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement