Australia Dominated The England On First Day Of 2nd Ashes Test At Lords - Sakshi
Sakshi News home page

Ashes 2nd Test ENG Vs AUS: ఆసీస్‌దే తొలిరోజు 

Published Thu, Jun 29 2023 2:07 AM | Last Updated on Thu, Jun 29 2023 10:06 AM

Australia dominated the second Test - Sakshi

లండన్‌: బ్యాటర్లు క్రీజులో పాతుకుపోవడంతో రెండో టెస్టు ఆ్రస్టేలియా ఆధిపత్యంతో మొదలైంది. యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ‘క్రికెట్‌ మక్కా’ లార్డ్స్‌ మైదానంలో జరుగుతున్న ఈ టెస్టులో తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్‌లో 83 ఓవర్లలో 5 వికెట్లకు 339 పరుగులు చేసింది. స్టీవ్‌ స్మిత్‌ (85 బ్యాటింగ్‌; 10 ఫోర్లు) అజేయ అర్ధసెంచరీతో నిలువగా, ట్రావిస్‌ హెడ్‌ (77; 14 ఫోర్లు), వార్నర్‌ (66; 8 ఫోర్లు, 1 సిక్స్‌) వన్డేలా ఆడి వేగంగా ఫిఫ్టీలు చేశారు.

ఇంగ్లండ్‌ బౌలర్లలో జోష్‌ టంగ్, రూట్‌ చెరో 2 వికెట్లు తీశారు. టాస్‌ నెగ్గిన ఇంగ్లండ్‌ ఫీల్డింగ్‌కే మొగ్గు చూపింది. దీనికి తగ్గట్లే బౌలర్లు కూడా ఓపెనర్లను పెవిలియన్‌కు పంపేవారు! కానీ పేలవమైన ఫీల్డింగ్‌ విలువైన వికెట్‌ అందిపుచ్చుకోలేకపోయింది. 13వ ఓవర్‌ ఆఖరి బంతి వార్నర్‌ బ్యాట్‌ అంచును తాకుతూ నాలుగో స్లిప్‌లో ఉన్న పోప్‌ వైపు వెళ్లింది. కానీ సునాయాసమైన ఈ క్యాచ్‌ను అతను నేలపాలు చేశాడు.

అప్పటికి వార్నర్‌ స్కోరు 20 పరుగులే. కాసేపటికి ఉస్మాన్‌ ఖ్వాజా (17; 2 ఫోర్లు)ను టంగ్‌ బౌల్డ్‌ చేయగా, లైఫ్‌తో వార్నర్‌ ఎంచక్కా అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డే ఫార్మాట్‌లా ఆడుతున్న అతన్ని కూడా టంగ్‌ బౌల్డ్‌ చేయగా, లబుషేన్‌–స్మిత్‌ జోడీ ఆతిథ్య బౌలర్లకు మింగుడుపడని భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఇద్దరు మూడో వికెట్‌కు 102 పరుగులు జత చేశారు. అనంతరం లబుషేన్‌ ఆటకు రాబిన్సన్‌ ముగింపు పలికాడు.

అయితే హెడ్‌ వచ్చాక స్మిత్‌ తన నిలకడైన బ్యాటింగ్‌ను కొనసాగించడంతో ఆతిథ్య బౌలర్లకు మళ్లీ కష్టాలు తప్పలేదు. ఇద్దరు ఆఖరి సెషన్‌లో అదరగొట్టారు. ఈ జోడీ ఇంగ్లండ్‌ పాలిట కొరకరానికొయ్యలా మారింది. నాలుగో వికెట్‌కు 118 పరుగులు జోడించాక రూట్‌ ఒకే ఓవర్లో హెడ్‌తో పాటు, గ్రీన్‌ (0)ను అవుట్‌ చేయడంతో ఇంగ్లండ్‌ శిబిరం ఊపిరి పీల్చుకుంది. స్మిత్‌తో పాటు క్యారీ (11 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు. 

1  ఈ మ్యాచ్‌తో ఆ్రస్టేలియా స్పిన్నర్‌ నాథన్‌ లయన్‌ తన కెరీర్‌లో 100 టెస్టులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో వరుసగా 100 టెస్టులు ఆడిన తొలి  బౌలర్‌గా లయన్‌ ఘనత సాధించాడు. గతంలో ఆలిస్టర్‌ కుక్‌ (159 టెస్టులు), బోర్డర్‌ (153), మార్క్‌ వా (107), సునీల్‌ గావస్కర్‌ (106), మెకల్లమ్‌ (101) వరుసగా 100కుపైగా టెస్టులు ఆడినా వారందరూ బ్యాటర్లు కావడం గమనార్హం.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement