దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత అఫ్గనిస్తాన్ మరోసారి భారత్‌లో తమ హోం మ్యాచ్‌లు ఆడనుంది. ఉత్తరప్రదేశ్ వేదికగా బంగ్లాదేశ్‌తో వన్డే, టీ20 సిరీస్ ఆడనుంది. ఇందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డుకు అనుమతినిచ్చింది.
ధ్రువీకరించిన బీసీసీఐ
ఈ విషయాన్ని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ధ్రువీకరించారని టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ‘‘తమ హోం సెంటర్‌గా అఫ్గనిస్తాన్ ఉత్తరప్రదేశ్‌ను ఎంచుకుంది. వాళ్లు తమ అంతర్జాతీయ మ్యాచ్‌లను ఇక్కడే ఆడతారు. కాన్పూర్, గ్రేటర్ నోయిడా వేదికగా సిరీస్‌లో పాల్గొంటారు.
ఇక్కడున్న గ్రీన్ పార్క్ స్టేడియం అత్యంత పురాతనమైన టెస్టు క్రికెట్ గ్రౌండ్. ఇక ముందు కాన్పూర్‌లో కూడా పూర్తిస్థాయిలో టెస్టులు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాం’’ అని రాజీవ్ శుక్లా పేర్కొన్నట్లు సదరు మీడియా సంస్థ తెలిపింది.
షెడ్యూల్ ఇదే
కాగా తమ దేశంలోని పరిస్థితుల దృష్ట్యా అఫ్గనిస్తాన్ 2019లో భారత్ వేదికగా వెస్టిండీస్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడింది. నాడు విండీస్‌తో టెస్టు మ్యాచ్‌తో పాటు మూడు మ్యాచ్‌ల వన్డే, టీ20 సిరీస్‌లు ఆడింది అఫ్గనిస్తాన్. లక్నోలోని ఏకనా స్టేడియం ఇందుకు వేదికైంది.
ఈసారి యూపీ వేదికగా మరోసారి బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే, టీ20 సిరీస్‌లు ఆడేందుకు సిద్ధమైంది. జూలై 25 నుంచి ఆగష్టు 6 వరకు ఈ సిరీస్ సాగనుంది. జూలై 25న మొదటి వన్డే, జూలై 27న రెండో వన్డే, జూలై 30న మూడో వన్డే... ఆగష్టు 2, 4, 6 తేదీల్లో టీ20 సిరీస్ ఆడనుంది.
అఫ్గన్ సిరీస్ తర్వాత టీమిండియా కాన్పూర్‌లో
ఇక ఈ ఏడాది స్వదేశంలో టీమిండియా బంగ్లాదేశ్‌తో సెప్టెంబరులో టెస్టు సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు (సెప్టెంబరు 19–23)చెన్నైలో జరుగనుండగా.. రెండో టెస్టు (సెప్టెంబరు 27–అక్టోబర్ 1)కు కాన్పూర్ వేదిక కానుంది.
ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024తో బిజీగా ఉన్న టీమిండియా.. సూపర్-8లో తమ తొలి మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్‌ను చిత్తు చేసింది. సెమీస్ లక్ష్యంగా శనివారం బంగ్లాదేశ్‌తో తమ రెండో మ్యాచ్‌లో తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment