ఆస్ట్రేలియా క్రికెట్‌లో ఒక విషయంలో కలవరం మొదలైంది. ప్రస్తుతం జట్టులో నాథన్ లియోన్ మాత్రమే ప్రధాన స్పిన్నర్‌గా కనిపిస్తున్నాడు. లియోన్ వయస్సు 35 సంవత్సరాలు. రిటైర్మెంట్‌కు దగ్గరికి వచ్చిన అతను మహా అయితే మరో రెండు సంవత్సరాలు ఆడే అవకాశం ఉంది. దిగ్గజం షేన్ వార్న్ తర్వాత టాప్‌క్లాస్ స్పిన్నర్‌గా పేరు తెచ్చుకున్న లియోన్ తన కెరీర్‌లో 117 టెస్టులాడి 468 వికెట్ల పడగొట్టాడు. దశాబ్దం కాలంగా లియోన్ ఆసీస్ టెస్టు జట్టులో ఏకైక ప్రధాన స్పిన్నర్‌గా కొనసాగుతూ వస్తున్నాడు. మరి అతను రిటైర్ అయ్యాకా ఆసీస్ క్రికెట్‌లో స్పిన్ భాద్యతలు తీసుకునేది ఎవరనేదానిపై చర్చ మొదలైంది.
ఆసీస్ లాంటి ఫాస్ట్ పిచ్ మైదానాలపై పేస్ బౌలర్లకు కొదువ లేదు. ఆ దేశం నుంచి వచ్చే బౌలర్లలోనే ఎక్కువగా మీడియం, ఫాస్ట్ బౌలర్లే కనిపిస్తారు తప్ప స్పిన్నర్లు చాలా తక్కువ. స్వదేశంలో ఆడినంత వరకు పేస్ దళంతోనే మ్యాచ్‌లు గెలిచే ఆస్ట్రేలియా భారత్ లాంటి ఉపఖండపు పిచ్‌లకు వచ్చేసరికి స్పిన్నర్లను వెతుక్కోవాల్సి వస్తోంది. అయితే టాడ్ మర్ఫీ రూపంలో ఆస్ట్రేలియా జట్టుకు ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు. 22 ఏళ్ల ఈ కుర్రాడు టీమిండియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో మంచి ప్రదర్శనే కనబరుస్తున్నాడు. ఇప్పటివరకు రెండు టెస్టులు కలిపి 10 వికెట్లు పడగొట్టాడు.
ఇదే విషయమై ఆసీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ స్పందించాడు. ''ప్రస్తుతం ఆస్ట్రేలియాకు పెద్ద దిక్కులా మారాడు. వార్న్ లాంటి దిగ్గజ ఆటగాడిని భర్తి చేయలేకపోయిన ఉన్నంతలో అతను టాప్ క్లాస్ స్పిన్నర్. మరి లియోన్ రిటైర్మెంట్ తర్వాత ఆసీస్ క్రికెట్‌లో స్పిన్ బాధ్యతలు తీసుకునేది ఎవరు అని ప్రశ్నించుకోవాలి. అందుకు నా సమాధానం 22 ఏళ్ల టాడ్ మర్ఫీ.
టీమిండియాతో తొలి టెస్టులోనే ఆస్ట్రేలియా తరపున టాడ్ మర్ఫీ అదిరిపోయే ప్రదర్శన చేశాడు. ఏడు వికెట్లతో ఆకట్టుకొని తానేంటో నిరూపించుకున్నాడు. ఈ ఏడు వికెట్లలోనూ ఐదు టాప్‌క్లాస్ బ్యాటర్లవే ఉన్నాయి. ఉపఖండం పిచ్‌లపై ప్రభావం చూపుతున్న ఒక డెబ్యూ బౌలర్ తర్వాతి కాలంలో జట్టుకు ప్రధాన స్పిన్నర్ అయ్యే అవకాశం ఉంటుంది.
నాథన్ లియోన్ అలా వచ్చినవాడే. అతని వారసత్వాన్ని టాడ్ మర్ఫీ కంటిన్యూ చేస్తాడని అనుకుంటున్నా. అయితే ఆస్ట్రేలియాకు టాడ్ మర్ఫీ రూపంలో ఒక మంచి స్పిన్నర్ దొరికినట్లే. వైవిధ్యమైన బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్న మర్ఫీ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే అద్బుతాలు చేయగలడన్న నమ్మకం ఉంది.'' అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక ఇరుజట్ల మధ్య ఇప్పటికే రెండు టెస్టులు ముగిశాయి. రెండు టెస్టుల్లోనూ విజయాలు అందుకున్న టీమిండియా నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ రెండు టెస్టులు కూడా రెండున్నర రోజుల్లోనే ముగిశాయి. ఇక మూడో టెస్టు మార్చి ఒకటి నుంచి ఇండోర్ వేదికగా జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment