చెన్నై-ఆర్సీబీ జట్ల మధ్య నిన్న (ఏప్రిల్ 17) జరిగిన మ్యాచ్ సందర్భంగా చిన్నస్వామి స్టేడియంలో ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది. స్టాండ్స్‌లో ఓ పిల్లాడు.. హాయ్ విరాట్ అంకుల్.. వామికను డేట్‌కు తీసుకెళ్లొచ్చా అని రాసివున్న ప్లకార్డును పట్టుకుని కనిపించాడు. ఈ దృశ్యం సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహానికి లోనవుతున్నారు. అభం శుభం తెలియని చిన్నారి గురించి ఇలాంటి మెసేజ్‌లు ఏంటనీ జనాలు చీదరించుకుంటున్నారు.
కొందరేమో.. పిల్లాడికి ఏం తెలుసు.. ఆ చిన్నారి బుద్ధిలేని తల్లిదండ్రులే ఇలా చేయించి ఉంటారని అంటున్నారు. ఇంకొందరేమో.. జనాల దృష్టిని ఆకర్శించేందుకు కొందరు ఇలాంటి చిల్లర పనులు చేస్తుంటారని లైట్‌గా తీసుకుంటున్నారు. మెజారిటీ శాతం ఆ చిన్నారి తల్లిదండ్రులపై మండిపడుతున్నారు. పెంపకంలో లోపం ఉంటే ఈ పిల్లాడి భవిష్యత్తు ఏంటని ఆందోళన చెందుతున్నారు. వామిక లాగే ఈ చిన్నారి కూడా అభం శుభం తెలియదని.. ఇలా చేసినందుకు అతని తల్లిదండ్రులను బొక్కలొ వేయాలని ఘాటుగా రెస్పాండ్ అవుతున్నారు.
కుటిల మనస్తత్వం గల కొందరేమో.. సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ దృశ్యానికి అసభ్యకరమైన మెసేజ్‌లు పెడుతూ రాక్షసానందం పొందుతున్నారు. కాగా, టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి-బాలీవుడ్ స్టార్ నటి అనుష్క శర్మల గారాల పట్టి వామిక అన్న విషయం అందరికీ తెలిసిందే. 2021లో వామిక జన్మించిన నాటి నుంచి మీడియాతో పాటు సినీ, క్రీడాభిమానుల కళ్లన్నీ ఈ చిన్నారిపైనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం కొందరు ప్రబుద్దులు ఉచ్చరణకు రాని భాషలో వామికపై దారుణమైన ట్రోల్స్ చేశారు. తాజాగా ఇంచుమించు అలాంటిదే ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది.
ఇదిలా ఉంటే, చెన్నై సూపర్ కింగ్స్‌తో నిన్న (ఏప్రిల్ 17) జరిగిన రసవత్తర పోరులో లోకల్ జట్టు ఆర్సీబీ 8 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై.. డెవాన్ కాన్వే (45 బంతుల్లో 83; 6 ఫోర్లు, 6 సిక్సర్లు), శివమ్ దూబే (27 బంతుల్లో 52; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేయగా.. ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 218 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. ఛేదనలో డుప్లెసిస్ (33 బంతుల్లో 62; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), మ్యాక్స్‌వెల్ (36 బంతుల్లో 76; 3 ఫోర్లు, 8 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడినప్పటికీ, స్వల్ప వ్యవధిలో ఇద్దరూ ఔట్ కావడంతో ఆర్సీబీకి ఓటమి తప్పలేదు.
Comments
Please login to add a commentAdd a comment