
ప్రస్తుత ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ భవిష్యత్తు తార రచిన్ రవీంద్ర ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటికే ఓ శతకం (ఇంగ్లండ్‌పై 82 బంతుల్లో శతకం) బాదిన రచిన్.. ఆసీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మరో విధ్వంసకర శతకం బాది పరుగుల వరద పారిస్తున్నాడు. ఆసీస్‌తో మ్యాచ్‌లో కేవలం 77 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో శతక్కొట్టిన రచిన్.. 116 పరుగులు చేసి ఔటయ్యాడు.
ఈ టోర్నీ రచిన్ ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీల సాయంతో 406 పరుగులు చేసి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో రచిన్ టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లిని అధిగమించాడు. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ (5 మ్యాచ్‌ల్లో 354 పరుగులు) నాలుగో స్థానంలో ఉండగా.. రచిన్ ఈ మ్యాచ్‌లో చేసిన పరుగులతో కోహ్లిని వెనక్కునెట్టాడు (ఐదో స్థానానికి).
ఈ జాబితాలో క్వింటన్ డికాక్ (6 మ్యాచ్‌ల్లో 431 పరుగులు) అగ్రస్థానంలో ఉండగా.. వార్నర్ (6 మ్యాచ్‌ల్లో 413) రెండు, మార్క్రమ్ (6 మ్యాచ్‌ల్లో 356) నాలుగో స్థానంలో నిలిచారు.
కాగా, ఈ మ్యాచ్‌లో ఆసీస్ నిర్ధేశించిన 389 పరుగుల అతి భారీ లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ పోరాడుతుంది. ఈ జట్టు 43 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసి లక్ష్యానికి 75 పరుగుల దూరంలో (42 బంతుల్లో) ఉంది. చేతిలో 4 వికెట్లు మాత్రమే ఉన్నాయి.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. డేవిడ్ వార్నర్ (65 బంతుల్లో 81; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), ట్రవిస్ హెడ్ (67 బంతుల్లో 109; 10 ఫోర్లు, 7 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్‌లతో శివాలెత్తడంతో 49.2 ఓవర్లలో 388 పరుగులు చేసి ఆలౌటైంది. ఆఖర్లో మ్యాక్స్‌వెల్ (24 బంతుల్లో 41; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), జోష్ ఇంగ్లిస్ (28 బంతుల్లో 38; 4 ఫోర్లు, సిక్స్), పాట్ కమిన్స్ (14 బంతుల్లో 37; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment