వన్డే వరల్డ్‌కప్ 2023 చివరి అంకానికి చేరుకుంది. నిన్నటితో రెండు సెమీస్ బెర్త్‌లు, టోర్నీ నుంచి నిష్క్రమించే రెండు జట్ల పేర్లు ఖరారయ్యాయి. ప్రస్తుత ఎడిషన్‌లో వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన భారత్ రెండు రోజుల కిందటే సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకోగా.. నిన్న పాక్ చేతిలో న్యూజిలాండ్ ఓడటంతో సౌతాఫ్రికా ఫైనల్ ఫోర్‌కు అర్హత సాధించిన రెండో జట్టుగా నిలిచింది.
ఈ ఎడిషన్ నుంచి నిష్క్రమించిన తొలి జట్టు బంగ్లాదేశ్ కాగా.. నిన్నటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమితో ఇంగ్లండ్ టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఈ ఇరు జట్లు ఏడు మ్యాచ్‌ల్లో చెరి 6 పరాజయాలు మూటగట్టుకుని టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యాయి. వీటిలో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఇంగ్లండ్ పరిస్థితి దారుణాతి దారుణంగా ఉంది. ఈ జట్టు వరుసగా ఐదు పరాజయాలు మూటగట్టుకుని అవమానకర రీతిలో సెమీస్‌కు కూడా చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది.
పోటీలో నాలుగు జట్లు..
ప్రస్తుతం మిగిలిన రెండు సెమీస్ బెర్త్‌ల కోసం నాలుగు జట్లు పోటీ పడుతున్నాయి. వీటిలో ఆస్ట్రేలియా మూడో బెర్త్‌ను (7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు) దాదాపుగా ఖరారు చేసుకోగా.. నాలుగో స్థానం కోసం న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
న్యూజిలాండ్ సెమీస్‌కు చేరాలంటే..
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో (8 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 0.398) ఉన్న కివీస్ సెమీస్‌కు చేరాలంటే వారు తదుపరి ఆడబోయే మ్యాచ్‌లో (శ్రీలంక) భారీ విజయం సాధించాల్సి ఉంటుంది.
కీలకపాత్ర పోషించనున్న నెట్ రన్‌రేట్..
ప్రస్తుతం 8 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన పాక్ సెమీస్‌కు చేరాలంటే వారు తదుపరి ఆడబోయే మ్యాచ్‌లో (ఇంగ్లండ్) భారీ తేడాతో గెలుపొందాల్సి ఉంటుంది.
పాక్, న్యూజిలాండ్‌లు తదుపరి మ్యాచ్‌ల్లో తమతమ ప్రత్యర్దులపై విజయాలు సాధిస్తే సమాన పాయింట్లు (10) కలిగి ఉంటాయి. ఇక్కడ నెట్ రన్‌రేట్ కీలకపాత్ర పోషిస్తుంది. రెండు జట్లలో మెరుగైన రన్‌రేట్ కలిగిన జట్టు సెమీస్‌కు చేరుకుంటుంది.
ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలను ఓడించాలి..
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో (7 మ్యాచ్‌ల్లో 4 విజయాలు) ఉన్న ఆఫ్ఘనిస్తాన్ సెమీస్‌కు చేరాలంటే వారు తదుపరి ఆడబోయే మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలను ఓడించాల్సి ఉంటుంది. ఈ జట్టు రెంటిలో ఒకటి ఓడినా సెమీస్ అవకాశాలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి. ఆఫ్ఘనిస్తాన్ రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫైనల్ ఫోర్‌కు చేరుకుంటుంది. అయితే పటిష్టమైన ఆసీస్, సౌతాఫ్రికాలను ఓడించడం ఆఫ్ఘనిస్తాన్‌కు అంత సులువు కాదు.
Comments
Please login to add a commentAdd a comment