వరల్డ్‌కప్‌ 2023 అత్యుత్తమ ఫీల్డర్‌గా కోహ్లి.. ఐసీసీ ప్రకటన | CWC 2023: Virat Kohli Is The Highest Rated Fielder By ICC In First 13 Days | Sakshi
Sakshi News home page

వరల్డ్‌కప్‌ 2023 అత్యుత్తమ ఫీల్డర్‌గా కోహ్లి.. ఐసీసీ ప్రకటన

Published Thu, Oct 19 2023 9:06 AM | Last Updated on Thu, Oct 19 2023 9:43 AM

CWC 2023: Virat Kohli Is The Highest Rated Fielder By ICC In First 13 Days - Sakshi

వరల్డ్‌కప్‌-2023లో మొదటి మూడు మ్యాచ్‌ల తర్వాత టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి అత్యధిక​ ప్రభావిత ఫీల్డర్‌గా ఐసీసీచే రేట్‌ చేయబడ్డాడు. టోర్నీలో ప్రతి జట్టు మూడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఐసీసీ ఈ పోటీని నిర్వహించగా.. అందరికంటే కోహ్లికే ఎక్కువ రేటింగ్‌ పాయింట్లు లభించాయి.

ఈ టోర్నీలో భారత్‌ ఇప్పటివరకు ఆజేయంగా నిలవడంలో కోహ్లి అసాధారణ ఫీల్డింగ్ నైపుణ్యాలు కీలకపాత్ర పోషించాయని ఐసీసీ ప్రకటించింది. ఈ విభాగంలో కోహ్లికి పోటీగా జో రూట్‌, డేవిడ్‌ వార్నర్‌ వచ్చినప్పటికీ, అంతిమంగా ఈ ఘనత కోహ్లికే దక్కింది. కోహ్లి 22.30 రేటింగ్‌ పాయింట్లు దక్కించుకోగా.. రూట్‌ 21.73, వార్నర్‌ 21.32 రేటింగ్‌ పాయింట్లు సాధించారు.

ఈ ముగ్గురితో పాటు ఈ విభాగంలో మరికొంతమంది ఆటగాళ్లు కూడా పోటీపడ్డారు. న్యూజిలాండ్‌ ఆటగాడు డెవాన్‌ కాన్వే (15.54), పాకిస్తాన్‌ షాదాబ్‌ ఖాన్‌ (15.13), ఆసీస్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (15),ఆఫ్ఘనిస్తాన్‌ రహ్మత్‌ షా (13.77), న్యూజిలాండ్‌ మిచెల్‌ సాంట్నర్‌ (13.28), పాక్‌ ఫకర్‌ జమాన్‌ (13.01), ఇషాన్‌ కిషన్‌ (13) వరల్డ్‌కప్‌ 2023లో మొదటి మూడు మ్యాచ్‌ల తర్వాత అత్యుత్తమ ఫీల్డర్‌ అవార్డు కోసం పోటీపడ్డారు. 

కాగా, క్యాచ్‌లు పట్టి, పరుగులు నియంత్రించడంతో పాటు మైదానంలో చురుగ్గా ఉండి జట్టు గెలుపుకు దోహదపడ్డ ఆటగాడిని గుర్తించడం కోసం ఐసీసీ ఈ ప్రత్యేక అవార్డును పరిచయం చేసింది. ప్రతి జట్టు మరో మూడు, మూడు మ్యాచ్‌లు ఆడిన తర్వాత ఐసీసీ ఈ అవార్డును మరోసారి ప్రకటించే అవకాశం ఉంది. 

ఇదిలా ఉంటే, ప్రస్తుత ప్రపంచకప్‌లో తొలి మూడు మ్యాచ్‌ల్లో జయభేరి మోగించిన భారత్‌.. పూణేలో ఇవాళ బంగ్లాదేశ్‌తో తలడపడనుంది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌లపై ఘన విజయాలు సాధించిన భారత్‌.. మరో విజయంపై కన్నేసింది. టీమిండియా ఆటగాళ్ల ఫామ్‌ ప్రకారం చూస్తే ఇది అంత కష్టమైన పనేమీ కాకపోవచ్చు. భారత్‌.. బంగ్లాదేశ్‌ను సునాయాసంగా ఓడించే అవకాశం ఉంది. అయితే ఏమరపాటుగా ఉంటే మాత్రం మూల్యం చెల్లించుకోకతప్పదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement