సీన్ విలియమ్స్ (జింబాబ్వే), వెస్టిండీస్ జట్టు, కశ్యప్ ప్రజాపతి(ఒమన్)
బులవాయో: మరోసారి సమష్టి ప్రదర్శనతో అదరగొట్టిన జింబాబ్వే జట్టు వన్డే ప్రపంచకప్ క్రికెట్ టోర్నీకి అర్హత సాధించే దిశగా మరో అడుగు ముందుకు వేసింది. లీగ్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన జింబాబ్వే... గురువారం మొదలైన ‘సూపర్ సిక్స్’ దశలోనూ శుభారంభం చేసింది.
ఒమన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే 14 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ గెలిచిన ఒమన్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 332 పరుగులు సాధించింది. వన్‌డౌన్ బ్యాటర్ సీన్ విలియమ్స్ (103 బంతుల్లో 142; 14 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఒమన్ బౌలర్లపై విరుచుకుపడి ఈ టోర్నీ రెండో సెంచరీ, కెరీర్‌లో ఏడో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
రజా, విలియమ్స్ అదుర్స్
సికందర్ రజా (49 బంతుల్లో 42; 6 ఫోర్లు)తో కలిసి నాలుగో వికెట్‌కు సీన్ విలియమ్స్ 102 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. చివర్లో ల్యూక్ జోంగ్వి (28 బంతుల్లో 43 నాటౌట్; 4 ఫోర్లు) దూకుడుగా ఆడటంతో జింబాబ్వే భారీ స్కోరు నమోదు చేసింది. ఒమన్ బౌలర్ ఫయాజ్ భట్ 79 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు.
కశ్యప్ ప్రజాపతి సెంచరీ
ఇక 333 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఒమన్ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లకు 318 పరుగులు చేసి ఓడిపోయింది. గుజరాత్‌లో జన్మించి ఒమన్ జట్టుకు ఆడుతున్న ఓపెనర్ కశ్యప్ ప్రజాపతి (97 బంతుల్లో 103; 12 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించాడు.
ఆకీబ్ ఇలియాస్ (45; 5 ఫోర్లు), జీషాన్ మక్సూద్ (37; 3 ఫోర్లు, 1 సిక్స్), అయాన్ ఖాన్ (47; 5 ఫోర్లు), నదీమ్ (30 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) కూడా పోరాడటంతో ఒకదశలో ఒమన్ లక్ష్యం దిశగా సాగుతున్నట్లు అనిపించింది.
తప్పని ఓటమి
అయితే కీలక తరుణాల్లో జింబాబ్వే బౌలర్లు వికెట్లు పడగొట్టి ఒమన్ ఓటమిని ఖరారు చేశారు. జింబాబ్వే బౌలర్లలో చటారా, ముజరబాని మూడు వికెట్ల చొప్పున తీయగా... ఎన్‌గరవాకు రెండు వికెట్లు దక్కాయి. సీన్ విలియమ్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. శుక్రవారం జరిగే రెండో ‘సూపర్ సిక్స్’ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో శ్రీలంక తలపడుతుంది.
విండీస్ కొంపముంచిన జింబాబ్వే.. ‘టాప్ ర్యాంక్’లోకి దూసుకొచ్చి
ఒమన్‌పై విజయంతో జింబాబ్వే ‘సూపర్ సిక్స్’ దశలో ఆరు పాయింట్లతో టాప్ ర్యాంక్‌లోకి వచ్చింది. లీగ్ దశలో గ్రూప్ ‘ఎ’లోని నెదర్లాండ్స్, వెస్టిండీస్ జట్లపై జింబాబ్వే గెలవడం... ఆ రెండు జట్లు కూడా ‘సూపర్ సిక్స్’ దశకు చేరుకోవడంతో... జింబాబ్వే ‘సూపర్ సిక్స్’ పోటీలను నాలుగు పాయింట్లతో మొదలుపెట్టింది.
ఒక్కటి ఓడినా అంతే సంగతులు!
తాజాగా ఒమన్‌పై నెగ్గిన జింబాబ్వే రెండు పాయింట్లు సాధించింది. జింబాబ్వే రన్‌రేట్ కూడా (0.75) బాగుంది. ఫలితంగా రన్‌రేట్‌లో చాలా వెనుకబడ్డ వెస్టిండీస్ (–0.35) జట్టు వన్డే ప్రపంచకప్‌కు అర్హత పొందాలంటే ‘సూపర్ సిక్స్’లో మూడు మ్యాచ్‌ల్లోనూ భారీ విజయాలు సాధించాల్సి ఉంటుంది. ‘సూపర్ సిక్స్’లో తొలి రెండు స్థానాల్లో నిలిచి ఫైనల్ చేరే రెండు జట్లకు ప్రపంచకప్ బెర్త్‌లు లభిస్తాయి.
ఇందుకోసం ఒకప్పుడు మేటి జట్లుగా పేరొందిన వెస్టిండీస్, శ్రీలంక ప్రధానంగా పోటీపడతాయని భావించగా.. అనూహ్యంగా జింబాబ్వే రేసులో ముందుకు దూసుకువచ్చింది. ఇక రన్‌రేటు పరంగా వెనుకబడి ఉన్న విండీస్ ఒక్క మ్యాచ్ ఓడినా వరల్డ్‌కప్-2023 ఆశలు వదులుకోకతప్పని దుస్థితి నెలకొంది. కాగా సూపర్‌సిక్స్‌లో భాగంగా విండీస్ శనివారం తమ మొదటి మ్యాచ్ స్కాట్లాండ్‌తో ఆడనుంది.
చదవండి: టీమిండియాతో టెస్టులకు సై.. కెప్టెన్‌గా బ్రాత్‌వైట్.. వాళ్లంతా జట్టుకు దూరం
Comments
Please login to add a commentAdd a comment