టీమిండియాను ఉద్దేశించి వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ ఈవెంట్లలో లీగ్ దశలో రాణిస్తున్నా.. సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే భారత జట్టు నాకౌట్ మ్యాచ్‌లలో తేలిపోతోందన్నాడు.
జట్టులో ఎంత మంది సూపర్‌స్టార్లు ఉన్నా టైటిల్ గెలవకపోతే ఏం లాభమని పెదవి విరిచాడు. కనీసం ఈసారైనా బలహీనతలు అధిగమించి వరల్డ్‌కప్ ట్రోఫీ గెలిచేలా వ్యూహాలు రచించాలని ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు లారా సూచించాడు.
పదకొండేళ్లుగా నిరీక్షణ
కాగా మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో 2007లో టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్‌కప్, చాంపియన్స్ ట్రోఫీ-2013 గెలిచిన టీమిండియా.. మళ్లీ ఇప్పటి వరకు ఐసీసీ టైటిల్ నెగ్గలేదు. పదకొండేళ్లుగా నిరీక్షణ కొనసాగుతూనే ఉంది.
ఇక హెడ్‌కోచ్‌గా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత జట్టు టీ20 ప్రపంచకప్-2022లో సెమీస్‌లో నిష్క్రమించగా.. వన్డే వరల్డ్‌కప్-2023లో ఫైనల్లో ఓడిపోయింది. ఈ రెండు సందర్భాల్లోనూ రోహిత్ సేన స్థాయికి తగ్గట్లు రాణించలేక టైటిల్ వేటలో వెనుకబడింది.
మరో అవకాశం
ఈ నేపథ్యంలో కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, టీ20 ప్రపంచకప్-2024 రూపంలో వీరిద్దరు తమను తాము నిరూపించుకునే మరో అవకాశం వచ్చింది. జూన్ 1 నుంచి మొదలయ్యే ఈ మెగా టోర్నీ నేపథ్యంలో బ్రియన్ లారా కీలక వ్యాఖ్యలు చేశాడు.
వ్యూహాలే లేవు
టీమిండియాను కలవరపెడుతున్న అంశాలేమిటి అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘గత టీ20, వన్డే వరల్డ్‌కప్ ఈవెంట్లలో భారత జట్టును గమనిస్తే.. వారి వద్ద టోర్నీలో ముందుకు సాగేందుకు సరైన ప్రణాళికలు లేవని అనిపించింది.
మీ దగ్గర వరల్డ్‌కప్ గెలిచే వ్యూహాలు లేనపుడు.. జట్టులో ఎంత మంది సూపర్‌స్టార్లు ఉంటే ఏం లాభం? ఎలా బ్యాటింగ్ చేయాలి? ప్రత్యర్థిని ఎలా అటాక్ చేయాలి అన్న విషయాలపై స్పష్టత ఉండాలి కదా!
ఈసారైనా ద్రవిడ్
ఈసారి రాహుల్ ద్రవిడ్ తమ ప్లేయర్లందరినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చి.. ప్రపంచకప్ గెలిచే ప్లాన్ చేస్తాడనే ఆశిస్తున్నా’’ అని లారా ఐసీసీ ఈవెంట్లో చెప్పుకొచ్చాడు. కాగా అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ వరల్డ్‌కప్ టోర్నీలో.. టీమిండియా జూన్ 5న ఐర్లాండ్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. న్యూయార్క్‌లోని నసావూ కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియం ఇందుకు వేదిక.
చదవండి: WC: పక్కా టీ20 టైప్.. న్యూయార్క్ పిచ్ వెనుక ఇంత కథ ఉందా? ద్రవిడ్‌తో కలిసి
Comments
Please login to add a commentAdd a comment