దులిప్ ట్రోఫీ-2024 సందర్భంగా ఇండియా-‘సి’ బౌలర్ అన్షుల్ కాంబోజ్ చరిత్ర సృష్టించాడు. ఈ రెడ్‌బాల్ టోర్నీ చరిత్రలో రెండో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన నమోదు చేసిన పేసర్‌గా నిలిచాడు. ఇండియా-‘బి’తో మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఇంతకు ముందు దేబాశీష్ మొహంతి (10/46) ఈ టోర్నమెంట్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన నమోదు చేశాడు. కాగా దులీప్ ట్రోఫీ తాజా ఎడిషన్.. తొలి రెండు రౌండ్లలో కలిపి జరిగిన నాలుగు మ్యాచ్‌లలో మూడింటిలో ఫలితం తేలగా మరో మ్యాచ్ మాత్రం పేలవమైన ‘డ్రా’గా ముగిసింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’
అనంతపురం వేదికగా ఆదివారం ముగిసిన మ్యాచ్‌లో ఇండియా-‘బి’, ఇండియా-‘సి’ జట్లు సమంగా నిలిచాయి. ఆట నాలుగో రోజు ఉదయం వరకు కూడా ఇరు జట్లు తొలి ఇన్నింగ్స్ పూర్తి కాకపోవడంతో ఫలితానికి అవకాశం లేకుండా పోయింది. ఓవర్‌నైట్ స్కోరు 309/7తో ఆట కొనసాగించిన ‘బి’ తమ తొలి ఇన్నింగ్స్‌లో 332 పరుగులకు ఆలౌటైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అన్షుల్ కాంబోజ్ (8/69) ప్రత్యర్థిని పడగొట్టాడు.
అనంతరం మ్యాచ్ ముగిసే సమయానికి ‘సి’ తమ రెండో ఇన్నింగ్స్‌ను 37 ఓవర్లలో 4 వికెట్లకు 128 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఈ దశలో ఇరు జట్ల కెప్టెన్లు ‘డ్రా’కు అంగీకరించారు. మొదటి ఇన్నింగ్స్‌లో 193 పరుగుల ఆధిక్యం సాధించిన ‘సి’ టీమ్‌కు 3 పాయింట్లు, ‘బి’ టీమ్‌కు 1 పాయింట్ లభించాయి. ఇక ఈ మ్యాచ్ తర్వాత ఓవరాల్‌గా తొమ్మిది పాయింట్లతో ఇండియా-‘సి’ ప్రస్తుతం పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
అర్ధ శతకంతో మెరిసిన రుతురాజ్
ఆదివారం భారత్ ‘బి’ తొలి ఇన్నింగ్స్ ముగిసేందుకు 7 ఓవర్లు సరిపోయాయి. తమ స్కోరుకు మరో 23 పరుగులు జోడించి జట్టు మిగిలిన 3 వికెట్లు కోల్పోయింది. ఈ మూడూ పేస్ బౌలర్ అన్షుల్ కాంబోజ్ ఖాతాలోకే వెళ్లగా... కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ (286 బంతుల్లో 157 నాటౌట్; 14 ఫోర్లు, 1 సిక్స్) అజేయంగా నిలిచాడు.
ఆ తర్వాత ఏకంగా 193 పరుగుల ఆధిక్యం ఉండి కాస్త దూకుడుగా ఆడి విజయం కోసం సవాల్ విసిరే స్థితిలో ఉన్న ‘సి’ టీమ్ అలాంటి ప్రయత్నం ఏమీ చేయలేదు. సాయి సుదర్శన్ (11) విఫలం కాగా, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (93 బంతుల్లో 62; 8 ఫోర్లు, 1 సిక్స్) రెండో ఇన్నింగ్స్‌లోనూ అర్ధ సెంచరీ చేశాడు. రుతురాజ్, రజత్ పటిదార్ (84 బంతుల్లో 42; 5 ఫోర్లు) రెండో వికెట్‌కు 96 పరుగులు జత చేశారు.
ఇండియా-‘బి’ వర్సెస్ ఇండియా-‘సి’ స్కోర్లు
ఇండియా-‘బి’- 332
ఇండియా-‘సి’- 525 & 128/4 డిక్లేర్డ్
ఫలితం తేలకుండానే ముగిసిన మ్యాచ్
రెండో రౌండ్ ముగిసిన దులిప్ ట్రోఫీ-2024 పాయింట్ల పట్టిక ఇలా..
👉ఇండియా- ‘సి’- 2(ఆడినవి)- గెలిచినవి(1)- డ్రా(1)- ఓడినవి(0)- పాయింట్లు 9
👉ఇండియా- ‘బి’- 2(ఆడినవి)- గెలిచినవి(1)- డ్రా(1)- ఓడినవి(0)- పాయింట్లు 7
👉ఇండియా- ‘ఎ’- 2(ఆడినవి)- గెలిచినవి(1)- డ్రా(0)-ఓడినవి(1)- పాయింట్లు 7
👉ఇండియా- ‘డి’- 2(ఆడినవి)- గెలిచినవి(0)- డ్రా(0)- ఓడినవి(2)- పాయింట్లు 0.
Comments
Please login to add a commentAdd a comment