నువ్విక మారవా?.. ఇలా అయితే టెస్టుల్లో చోటు కష్టమే! | DT 2024: Riyan Parag Wastes Yet Another Bright Start Reckless Shot Fans Fire | Sakshi
Sakshi News home page

నువ్విక మారవా?.. కాస్త ఓపిక ఉండాలి.. టెస్టుల్లో చోటు కష్టమే!

Published Sat, Sep 14 2024 7:35 PM | Last Updated on Sat, Sep 14 2024 8:09 PM

DT 2024: Riyan Parag Wastes Yet Another Bright Start Reckless Shot Fans Fire

టీమిండియా యువ బ్యాటర్‌ రియాన్‌ పరాగ్‌ దులిప్‌ ట్రోఫీ-2024లో ఆకట్టుకోలేకపోతున్నాడు. ఇన్నింగ్స్‌ను మెరుగ్గా ఆరంభిస్తున్నా.. వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమవుతున్నాడు. నిర్లక్ష్య ఆట తీరుతో వికెట్‌ పారేసుకుంటున్నాడనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కాగా అసోంకు చెందిన ఆల్‌రౌండర్‌ రియాన్‌ పరాగ్‌.. ఈ రెడ్‌బాల్‌ టోర్నీలో ఇండియా-‘ఎ’ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

తొలి మ్యాచ్‌లో ఇలా
తాజా ఎడిషన్‌లో భాగంగా ఇండియా-‘ఎ’ తొలుత బెంగళూరు వేదికగా ఇండియా-‘బి’తో మ్యాచ్‌ ఆడింది. ఇందులో రియాన్‌ చేసిన స్కోర్లు 30, 31. ఇక ప్రస్తుతం అనంతపురంలో ఇండియా-‘ఎ’ తమ రెండో మ్యాచ్‌ ఆడుతోంది. ఇందులో భాగంగా ఇండియా-‘డి’ జట్టుతో తలపడుతోంది. మ్యాచ్‌లో జట్టు పటిష్ట స్థితిలో ఉన్నప్పటికీ.. విశ్లేషకులు మాత్రం రియాన్‌ పరాగ్‌ ఆట తీరుపై పెదవి విరుస్తున్నారు.

వేగం పెంచి వికెట్‌ సమర్పించుకున్నాడు
తొలి ఇన్నింగ్స్‌లో 29 బంతుల్లోనే 5 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 37 పరుగులు చేసిన రియాన్‌.. మంచి జోష్‌లో కనిపించాడు. అయితే, కాస్త ఆచితూచి ఆడాల్సిన చోట వేగం పెంచి వికెట్‌ సమర్పించుకున్నాడు. అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో దేవ్‌దత్‌ పడిక్కల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ పాత కథే పునరావృతం చేశాడు.

ఇండియా-‘ఎ’ శతక ధీరుడు, ఓపెనర్‌ ప్రథమ్‌ సింగ్‌(122) అవుట్‌కాగా.. అతడి స్థానంలో క్రీజులోకి వచ్చాడు రియాన్‌ పరాగ్‌. తిలక్‌ వర్మ(111 నాటౌట్‌)తో కలిసి మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పే అవకాశం ఉన్నా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. పరిమిత ఓవర్ల మాదిరే దూకుడుగా ఆడి మరోసారి తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు.

 

భారీ స్కోర్లుగా మలచలేకపోయాడు
ఇండియా-‘డి’ స్పిన్నర్‌ సౌరభ్‌ కుమార్‌ బౌలింగ్‌లో వరుస బౌండరీలు బాది.. అతడి చేతికే చిక్కి పెవిలియన్‌ చేరాడు. 31 బంతుల్లో 20 పరుగుల వద్ద ఉండగా.. అనవసరపు షాట్‌కు పోయి సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌ ఆదిత్య థాకరేకు సులువైన క్యాచ్‌ ఇచ్చి నిష్క్రమించాడు.

ఈ నేపథ్యంలో రియాన్‌ పరాగ్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. ‘‘పరిమిత ఓవర్ల క్రికెట్‌కు మాత్రమే రియాన్‌ పనికివస్తాడు. సంప్రదాయ క్రికెట్‌లోనూ ప్రతీ బంతికి దూకుడు ప్రదర్శిస్తానంటే కుదరదు. నిజానికి.. బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు ముందు తనను తాను నిరూపించుకునేందుకు రియాన్‌కు మంచి అవకాశం వచ్చింది. ఇన్నింగ్స్‌ను ఘనంగా ఆరంభించినా వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయాడు.

టెస్టు జట్టులో చోటు దక్కాలంటే కాస్త ఓపిక కూడా ఉండాలి’’ అని సోషల్‌ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. శనివారం నాటి మూడో రోజు ఆట ముగిసే సరికి ఇండియా-‘ఎ’ జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. ఇండియా-‘డి’కి 426 పరుగుల భారీ లక్ష్యం విధించింది.

చదవండి: 'అతడు ఆటను గౌరవించడు.. జట్టులో చోటు దండగ'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement