సేలం (తమిళనాడు): ఎడంచేతి వాటం స్పిన్నర్ ఆర్.సాయికిశోర్ (7/70) ఏడు వికెట్లతో తిప్పేయడంతో... నార్త్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్‌లో సౌత్ జోన్ జట్టుకు భారీ ఆధిక్యం లభించింది. ఓవర్‌నైట్ స్కోరు 17/0తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన నార్త్ జోన్ జట్టు 67 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. యశ్ ధుల్ (39; 4 ఫోర్లు, 1 సిక్స్), నిశాంత్ (40; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) మినహా మిగతా వారు విఫలమయ్యారు.
423 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన సౌత్ జోన్ జట్టు ప్రత్యర్థిని ఫాలోఆన్ ఆడించకుండా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆట ముగిసే సమయానికి సౌత్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లో 28 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 157 పరుగులు చేసింది. రోహన్ (77; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించాడు. మయాంక్ అగర్వాల్ (53 బ్యాటింగ్; 6 ఫోర్లు), టి.రవితేజ (19 బ్యాటింగ్; 2 ఫోర్లు, 1 సిక్స్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం సౌత్ జోన్ ఓవరాల్ ఆధిక్యం 580 పరుగులకు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment