![Every Batsmen Will Have Game Plan Dravid Ahead Challenging South Africa Tests - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/6/rahulrohit.jpg.webp?itok=RdiGQA8r)
India’s tour of South Africa, 2023: సౌతాఫ్రికా గడ్డ మీద టెస్టు సిరీస్ గెలవడం అంత సులువేమీ కాదని టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. సఫారీ పిచ్‌లపై బ్యాటింగ్ చేయడం భారత బ్యాటర్లకు సవాలుతో కూడుకున్నదని పేర్కొన్నాడు.
ప్రొటిస్ గడ్డపై ఒక్కటీ గెలవలేదు
కాగా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టెస్టు, వన్డే, టీ20.. ఇలా మూడుఫార్మాట్లలో ప్రస్తుతం నంబర్ వన్‌గా కొనసాగుతున్న టీమిండియా.. ఇంతవరకు దక్షిణాఫ్రికాలో ఒక్క టెస్టు సిరీస్ కూడా గెలవలేదు. పటిష్ట జట్టుగా పేరొందిన భారత్ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో రెండుసార్లు వరుసగా ఫైనల్ చేరినప్పటికీ ప్రొటిస్ గడ్డ మీద జెండా పాతలేకపోతోంది.
అయితే, తాజా పర్యటన నేపథ్యంలో ఈ అపవాదును చెరిపివేయాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. స్వదేశంలో వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్లో ఓటమితో డీలా పడిన టీమిండియా.. సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్ గెలిచి అభిమానుల బాధను కాస్తైనా తగ్గించాలనే యోచనలో ఉంది.
సఫారీ పిచ్‌లపై బ్యాటింగ్ అంటే సవాలే
ఈ నేపథ్యంలో డిసెంబరు 26 నుంచి సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆరంభం కానున్న తరుణంలో హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘దక్షిణాఫ్రికా పిచ్‌లపై బ్యాటింగ్ చేయడం సవాలుతో కూడుకున్నదనే విషయం గణాంకాలను చూస్తే అర్థమవుతుంది.
ముఖ్యంగా జొహన్నస్‌బర్గ్, సెంచూరియన్‌లలో బ్యాటింగ్ చేయడం బిగ్ చాలెంజ్. కాబట్టి ప్రతి బ్యాటర్ కూడా తమదైన ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.
గేమ్ ప్లాన్‌ను పక్కాగా అమలు చేసే నిబద్ధత ఉంటేనే అక్కడ ఏ బ్యాటర్ అయినా విజయవంతం కాగలడు. అందుకు తగ్గట్లుగా ముందు నుంచే ప్రాక్టీస్ చేయడం అత్యవసరం’’ అని ద్రవిడ్ పేర్కొన్నాడు.
ఒత్తిడికి లోనుకాకుండా చూసుకోవాలి
అదే విధంగా.. దక్షిణాఫ్రికా టూర్‌లో తాము.. ప్రతి ఒక్క ఆటగాడు ఒకే రీతిలో ఆడాలని తాము కోరుకోవడం లేదన్న ద్రవిడ్.. ప్రతి ఒక్కరి కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించాడు. ముఖ్యంగా యువ ఆటగాళ్లు ఒత్తిడికి లోనుకాకుండా స్వేచ్ఛగా ఆడేలా చూడటమే లక్ష్యమని పేర్కొన్నాడు.
అలాంటపుడే వారి నుంచి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ రావాలని కోరుకోగలమని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు. కాగా డిసెంబరు 10 నుంచి ఆరంభం కానున్న సౌతాఫ్రికా టూర్‌లో టీమిండియా తొలుత.. టీ20, వన్డే సిరీస్‌లు ఆడనుంది. ఆ తర్వాత డిసెంబరు 26 నుంచి సెంచూరియన్, కేప్‌టౌన్ వేదికగా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో పాల్గొననుంది.
చదవండి: నువ్వే నా ప్రపంచం.. నా సర్వస్వం: బుమ్రా భార్య భావోద్వేగ పోస్ట్
Comments
Please login to add a commentAdd a comment