
భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో వన్డే ప్రపంచకప్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే అన్ని జట్లు సన్నాహకాలు మొదలుపెట్టాయి. ఆస్ట్రేలియా అయితే ఏకంగా తమ కోర్ టీమ్‌ను కూడా ప్రకటించేసింది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సైతం టీమిండియాను ఎంపిక చేసేందుకు భారీ కసరత్తు చేస్తుంది.
వరల్డ్‌కప్‌కు ఎంపిక చేసే భారత జట్టులో ఎవరెవరు ఉండాలన్న అంశంపై అభిమానులు సోషల్‌మీడియా వేదికగా ఇప్పటికే విస్తృత స్థాయి చర్చలు మొదలుపెట్టారు. పలానా ఆటగాడు ఉండాలని కొందరు, పలానా ఆటగాడు ఉండకూడదని మరికొందరు తమతమ అభిప్రాయాలను షేర్ చేస్తున్నారు.
మరోవైపు గాయాల బారిన పడి గతకొంతకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న స్టార్ ఆటగాళ్లపై (కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్) కూడా చర్చ నడుస్తుంది. ఒకవేళ వారు జట్టులోకి తిరిగి వస్తే ప్రస్తుతమున్న యువ ఆటగాళ్ల పరిస్థితి ఏంటని చర్చించుకుంటున్నారు.
రోహిత్‌కు జతగా మరో ఓపెనర్ ఎవరు.. కోహ్లితో పాటు మిడిలార్డర్‌లో ఎవరెవరు ఉంటారు.. ఒకవేళ కేఎల్ రాహుల్ గాయం నుంచి కోలుకుని వరల్డ్‌కప్‌కు అందుబాటులోకి వస్తే అతను వికెట్‌కీపింగ్ కూడా చేస్తాడా, లేదా.. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా ఎవరుంటారు.. ఆల్‌రౌండర్ల కోటాలో జడేజాతో పాటు ఎవరెవరు జట్టులో ఉంటారు.. పేస్ విభాగం ఎలా ఉండబోతుంది..?
ఇలా సవాలక్ష ప్రశ్నలు అభిమానుల మెదళ్లను తొలిచి వేస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా రోహిత్ శర్మ పార్ట్‌నర్ ఎవరనే డిస్కషన్ తారా స్థాయిలో జరుగుతుంది. ఇటీవల యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తరుచూ విఫలమవుతుండటంతో ఈ చర్చ పతాక స్థాయికి చేరింది. ఈ క్రమంలో గిల్ ప్రత్యామ్నాయంగా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధవన్ పేరు వినిపిస్తుంది.
ఐసీసీ టోర్నీల్లో ధవన్‌కు ఘనతమైన రికార్డు ఉండటం అతనికి అనుకూలంగా మారే అవకాశం ఉంది. ధవన్ ఐసీసీ టోర్నీల్లో 27 ఇన్నింగ్స్‌ల్లో 50.4 సగటున 97.25 స్ట్రయిక్ రేట్‌తో 6 సెంచరీలు, 4 అర్ధసెంచరీల సాయంతో 1312 పరుగులు చేశాడు. ఈ గణాంకాలు చూపించి ధవన్ అభిమానులు అతన్ని వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
వయసు పైబడిన రిత్యా ధవన్‌కు ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ అవుతుందని, అందుకైనా అతనికి చివరి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ధవన్‌కు పోటీగా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ యశస్వి వన్డే అరంగేట్రం చేసి రాణిస్తే, ధవన్‌కు మొండిచెయ్యి ఎదురుకావచ్చు. మరి ఇన్ని సమీకరణల నేపథ్యంలో వరల్డ్‌కప్‌లో రోహిత్‌కు జోడీగా ఎవరిని బరిలోకి దిగుతారో వేచి చూడాలి.