పూణేలో ఇంగ్లాండ్‌తో శుక్రవారం జరిగిన నాలుగో మ్యాచ్‌లో శివం దుబే స్థానంలో కంకషన్ సబ్స్టిట్యూట్ గా అసాధారణ పరిస్థితుల్లో హర్షిత్ రాణా (Harshit Rana) భారత్ తరఫున తన టీ20 అరంగేట్రం చేసాడు. భారత్ క్రికెట్ జట్టు తీసుకున్న ఈ నిర్ణయం పెద్ద దుమారాన్నే రేకెత్తించింది. ఒక ఆల్ రౌండర్ స్థానంలో పేసర్‌ను జట్టులోకి తీసుకోవడాన్ని క్రికెట్ నిపుణులు, ముఖ్యంగా ఇంగ్లాండ్ మాజీ ఆటగాళ్లు నిశితంగా విమర్శించారు.
ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ రూపొందించిన నియమావళికి విరుద్ధమని ఇంగ్లాండ్ నిపుణుల వాదన. దీనికి భారత్ మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వంటి వాళ్ళు కూడా సమర్ధించడం విశేషం. ఎందుకంటే ఐసీసీ నియమావళి ప్రకారం దూబే స్థానం లో 'లైక్-ఫర్-లైక్' ప్రత్యామ్యాయ ఆటగాడ్ని ఎంచుకోవాలి. రాణా రావడంతో భారత్ జట్టుకి మేలు చేకూరింది. అదనపు బౌలింగ్ ఆప్షన్ లభించింది.
ఐసీసీ నియమావళి ప్రకారం కంకషన్ సబ్ స్టిట్యూట్ ఆటగాడిగా దాదాపు ఒకే తరహా ఆటగాళ్లను మాత్రమే ఎంచుకోవాలి. ఈ విషయం పై మాజీ ఇంగ్లాండ్ క్రికెటర్, క్రికెట్ వ్యాఖ్యాత కెవిన్ పీటర్సన్ భారత్ జట్టు నిర్ణయాన్ని దుయ్యబట్టారు. " ఐసీసీ నిబంధలు ప్రకారం కంకషన్ లేదా అనుమానిత కంకషన్‌కు గురైన ఆటగాడికి సమానమైన వారిని మాత్రమే ప్రత్యామ్నాయంగా జట్టులోకి తీసుకోవాలని పీటర్సన్ వ్యాఖ్యానించాడు. హర్షిత్ రాణా పూర్తి స్థాయి పేస్ బౌలర్ కాగా, దుబే బ్యాటింగ్ ఆల్ రౌండర్ కాబట్టి భారత్ ఈ మ్యాచ్ లో తప్పనిసరిగా 12 మంది ఆటగాళ్లతో పోటీ కి దిగిందని భావించాల్సి వస్తుందని పీటర్సన్ పేర్కొన్నాడు.
అంతకుముందు శివమ్ దూబే 34 బంతుల్లో 53 పరుగులు చేశాడు. క్లిష్ట సమయంలో భారత్ ని ఆదుకుని జట్టు గౌరవప్రదమైన స్కోర్ సాధించేందుకు తన వంతు పాత్ర పోషించాడు. భారత్ ఇన్నింగ్స్ చివరి ఓవర్లో జేమీ ఓవర్టన్ వేసిన బంతి హెల్మెట్‌కు తగలడం తో దూబే గాయం కారణంగా వైదొలిగాడు. దూబే స్తానం లో వచ్చిన రాణా నాలుగు ఓవర్లలో మూడు వికెట్లు పడగొట్టాడు.
ఐపీఎల్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ కి ప్రాతినిధ్యం వహించే రాణా ఇంగ్లాండ్ 12వ ఓవర్‌లో లియామ్ లివింగ్‌స్టోన్‌ను అవుట్ చేశాడు. ఆ తర్వాత 16వ ఓవర్‌లో జాకబ్ బెథెల్‌ను కేవలం 6 పరుగులకే వెనక్కి పంపి ఇంగ్లాండ్‌పై మరో దెబ్బ వేసాడు. 18వ ఓవర్‌లో జామీ ఓవర్టన్‌ను 19 పరుగులకు క్లీన్ బౌలింగ్ చేసి భారత్ కి విజయం ఖాయం చేశాడు. రాణా 33 పరుగులకు 3 వికెట్లు పడగొట్టి అంతర్జాతీయ క్రికెట్‌లో తనదైన శైలి లో అరంగ్రేటం చేసాడు.
ఈ వివాదం ఎలా ఉన్న రాణా తన ఈ మ్యాచ్ లో తన ఆటతీరు చాల సంతృప్తినిచ్చిందని, తనకు కలల అరంగేట్రం లభించిందని చెప్పాడు. "ఇది నాకు ఇప్పటికీ కలల అరంగేట్రం. దుబే గాయంతో వైదొలగడం తో రెండు ఓవర్ల తర్వాత నేను కంకషన్ ప్రత్యామ్నాయంగా ఆడబోతున్నాని సమాచారం అందింది. నేను చాలా కాలంగా భారత్ జట్టు తరుఫున ఆడాలని ఎదురు చూస్తున్నాను. నా నైపుణ్యాన్ని నిరూపించుకోవాలనుకున్నాను. నేను ఐపీఎల్‌లో బాగానే బౌలింగ్ చేసాను.ఇక్కడ కూడా అదే రీతిలో ఆడుతున్నానని రాణా పూణే మ్యాచ్ అనంతరం చెప్పాడు.
8వ ఓవర్లో మైదానంలోకి దిగిన రాణా, ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ఇచ్చిన క్యాచ్ కూడా పట్టుకుని అతన్ని అవుట్ చేయడంలో కీలకమైన పాత్ర పోషించాడు. అయితే రాణాను ప్రత్యామ్నాయంగా ఎంపిక చేయడం చాలా మంది అభిమానులకు నచ్చలేదు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ తన సోషల్ మీడియాలో ఈ విషయం పై స్పందిస్తూ “పార్ట్ టైమ్ బౌలింగ్ చేసే బ్యాట్స్‌మన్ స్థానంలో పూర్తి స్థాయి బౌలర్ అయిన రాణా ని ఎలా తీసుకుంటారు అని ప్రశ్నించాడు. రమణ్‌దీప్ (సింగ్) దూబేకు సమానమైన ప్రత్నామ్యాయం అని వ్యాఖ్యానించాడు.
దీని పై భారత్ మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా విమర్శించడం గమనార్హం. "ఇదేమీ ఆట? దూబే స్థానంలో రాణా ప్రత్నామ్యాయ అతగాడి రంగ ప్రవేశం చేయడం ఇది ఐపీఎల్ మ్యాచ్ లో సూపర్‌సబ్ వ్యవహారం లాగా ఉంది ”అని అశ్విన్ వ్యాఖ్యానించాడు. ఈ వివాదం అటుంచితే ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్ ముందు హర్షిత్ రాణా రాణించడం భారత్ కి శుభపరిణామం. ఇప్పటికే భారత్ ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి నుంచి పూర్తిగా కోలుకోక పోవడం, సీనియర్ పేస్ బౌలర్ మహమ్మద్ షమీ ఫిటినెస్ పై అనుమానాలు రేకెత్తుతున్న సమయంలో రాణా రంగప్రవేశం భారత్ కి కొంత ఉపశమనాన్నిస్తుదనడంలో సందేహం లేదు.
Comments
Please login to add a commentAdd a comment