విహారి, రిషభ్ పంత్
‘పింక్ టెస్ట్’కు ముందు జరుగుతున్న డే అండ్ నైట్ సన్నాహక పోరులో భారత బ్యాట్స్‌మెన్ పండగ చేసుకున్నారు. టెస్టు తుది జట్టులో స్థానాన్ని ఆశిస్తున్న ముగ్గురు ఆటగాళ్లు కూడా రెండో ఇన్నింగ్స్‌లో సత్తా చాటారు. ఆరో బ్యాట్స్‌మన్‌గా అవకాశం కోరుకుంటున్న హనుమ విహారి శతకం సాధించగా... వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాతో పోటీ పడుతున్న రిషభ్ పంత్ తన బ్యాటింగ్ పదునేమిటో మెరుపు సెంచరీతో చూపించాడు. రెండో ఓపెనర్‌గా అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్న శుబ్‌మన్ గిల్ కూడా చక్కటి బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చగా, ఇప్పటికే ఓపెనర్‌గా ఉన్న మయాంక్‌కు కూడా మంచి ప్రాక్టీస్ లభించింది. అయితే పృథ్వీ షా మాత్రం మరో అవకాశాన్ని వృథా చేసుకున్నాడు. రెండో రోజు ఆటలో భారత్ ముందు తేలిపోయిన ఆస్ట్రేలియా ‘ఎ’ చివరి రోజు ఓటమిని తప్పించుకోగలదా చూడాలి.
సిడ్నీ: మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో తడబడిన భారత బ్యాట్స్‌మెన్ వెంటనే తమ ఆటను చక్కదిద్దుకున్నారు. మ్యాచ్ రెండో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 386 పరుగులు చేసింది. ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారి (194 బంతుల్లో 104 బ్యాటింగ్; 13 ఫోర్లు), రిషభ్ పంత్ (73 బంతుల్లో 103 బ్యాటింగ్; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీలతో కదం తొక్కారు. శుబ్‌మన్ గిల్ (78 బంతుల్లో 65; 10 ఫోర్లు), మయాంక్ అగర్వాల్ (120 బంతుల్లో 61; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. తొలి ఇన్నింగ్స్‌లోని 86 పరుగులు కలిపి భారత్ ఓవరాల్ ఆధిక్యం 472 పరుగులకు చేరింది. రెండో రోజు మధ్యలో కొద్దిసేపు వర్షం అంతరాయం కలిగించినా... ఇబ్బంది లేకుండా మొత్తం 90 ఓవర్ల ఆట సాగింది. నేడు మ్యాచ్‌కు ఆఖరి రోజు.
పృథ్వీ షా విఫలం...
చక్కటి బ్యాటింగ్ పిచ్‌పై కనీసం నిలబడే ప్రయత్నం చేయకుండా పృథ్వీ షా (3) పేలవ షాట్ ఆడి ఆరంభంలోనే నిష్క్రమించాడు. ఈ ప్రదర్శన అతనికి టెస్టు జట్టు అవకాశాలు కూడా దూరం చేయవచ్చు! అయితే ఓపెనర్ స్థానం కోసం షాతో పోటీ పడుతున్న గిల్ మాత్రం మరోసారి సాధికారిక ఆటతీరు కనబర్చాడు. చూడచక్కటి కవర్‌డ్రైవ్‌లు, పుల్ షాట్లతో పాటు బ్యాక్‌ఫుట్‌పై పూర్తి నియంత్రణతో అతను ఆడిన తీరు సరైన టెస్టు బ్యాట్స్‌మన్‌ను చూపించాయి.
49 బంతుల్లోనే అతని అర్ధ సెంచరీ పూర్తయింది. అయితే కొద్ది సేపటికే దురదృష్టవశాత్తూ అంపైర్ సందేహాస్పద నిర్ణయంతో గిల్ వెనుదిరిగాడు. స్వెప్సన్ బౌలింగ్‌లో ఎల్బీ కోసం అప్పీల్ చేయగా... బంతి బ్యాట్‌కు తగిలిందని భావించిన అంపైర్ స్లిప్‌లో అబాట్ క్యాచ్ పట్టడంతో అవుట్‌గా ప్రకటించాడు. మరోవైపు మయాంక్ పట్టుదలగా క్రీజ్‌లో నిలబడ్డాడు. స్వెప్సన్ ఓవర్లో వరుసగా 6, 4 కొట్టిన అతను 91 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. అనంతరం భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
పంత్ దూకుడు...
తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన విహారి రెండో ఇన్నింగ్స్‌ను సమర్థంగా ఉపయోగించుకున్నాడు. ఫ్లడ్ లైట్ల వెలుగులో గులాబీ బంతి కొంత ఇబ్బంది పెడుతున్న సమయంలో అతను చక్కటి ఏకాగ్రతతో బ్యాటింగ్ చేశాడు. అందమైన ఆన్ డ్రైవ్‌లు అతని ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచాయి. 98 బంతుల్లో విహారి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. విహారి 62 పరుగుల వద్ద ఉన్నప్పుడు అతనితో పంత్ జత కలిసిన తర్వాత ఆట స్వరూపమే మారిపోయింది.
విహారి, పంత్ 147 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యంలో (22.4 ఓవర్లలో) విహారి స్కోరు 42 పరుగులు మాత్రమే కాగా పంత్ సెంచరీతో చెలరేగడం విశేషం. ప్రతీ బౌలర్‌పై విరుచుకుపడ్డ పంత్ 43 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. మరోవైపు విల్డర్‌ముత్ బౌలింగ్‌లో సింగిల్‌తో 188 బంతుల్లో విహారి శతకం పూర్తయింది. అయితే రెండో రోజు చివరి ఓవర్‌కు ముందు ఓవర్ ఆఖరి బంతికి సదర్‌లాండ్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన పంత్ 81 పరుగుల వద్ద నిలిచాడు. విల్డర్‌ముత్ వేసిన ఆఖరి ఓవర్ మొదటి బంతి అతని పొట్టలో బలంగా తగిలింది. అనంతరం తర్వాతి ఐదు బంతుల్లో 4, 4, 6, 4, 4 బాదిన పంత్ 73 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకొని అజేయంగా నిలిచాడు.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: 194; ఆస్ట్రేలియా ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: 108; భారత్ రెండో ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) స్వెప్సన్ (బి) స్టెకెటీ 3; మయాంక్ (సి) (సబ్) రోవ్ (బి) విల్డర్‌ముత్ 61; గిల్ (సి) అబాట్ (బి) స్వెప్సన్ 65; విహారి (బ్యాటింగ్) 104; రహానే (సి) క్యారీ (బి) స్టెకెటీ 38; పంత్ (బ్యాటింగ్) 103; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (90 ఓవర్లలో 4 వికెట్లకు) 386.
వికెట్ల పతనం: 1–4; 2–108; 3–161; 4–239.
బౌలింగ్: సీన్ అబాట్ 7–1–24–0; స్టెకెటీ 16–1–54–2; సదర్‌లాండ్ 16–5–33–0; విల్డర్‌ముత్ 15–2–79–1; స్వెప్సన్ 29–1–148–1; మ్యాడిసన్ 7–1–42–0
బౌలర్లకు ప్రాక్టీస్ కావాలి...
విజయానికి సరిపడా స్కోరు సాధించినా భారత్ తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయలేదు. మన బ్యాట్స్‌మెన్‌కు ఫ్లడ్‌లైట్ల వెలుగులో రెండో రోజు మంచి ప్రాక్టీస్ లభించింది. అయితే బౌలర్లు మాత్రం డే అండ్ నైట్ మ్యాచ్ కోసం మరింత సాధన కోరుకుంటున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ ‘ఎ’ 32.2 ఓవర్లకే కుప్పకూలింది. ఆ జట్టు పేలవ ప్రదర్శనను పరిగణలోకి తీసుకుంటే వారు రోజంతా నిలబడతారా అనేది సందేహమే. చీకటి పడే సమయానికి ముందే ఆసీస్ ‘ఎ’ ఇన్నింగ్స్ ముగిసిపోతే పింక్ బాల్‌తో మన బౌలర్లు ఆశించిన ప్రాక్టీస్ లభించదు. అందుకే ఫలితంతో సంబంధం లేకుండా చివరి రెండు సెషన్లు ప్రత్యర్థికి బ్యాటింగ్ చేసే అవకాశం ఇవ్వాలని భారత్ కోరుకుంటోంది. అందుకే భారత్ తమ బ్యాటింగ్‌ను కొనసాగించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment