BGT 2023: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇండోర్ వేదికగా రేపటి నుంచి (మార్చి 1) ప్రారంభంకానున్న మూడో టెస్ట్ కోసం సర్వం సిద్ధమైంది. కీలకమైన ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల ఆటగాళ్లు కఠోరంగా శ్రమిస్తున్నారు. 4 మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే 0-2తో వెనుకపడిన ఆసీస్‌ను గాయాల బెడద, సారధి అందుబాటులో లేకపోవడం లాంటి సమస్యలు వేధిస్తుంటే, తుది జట్టు కూర్పు విషయంలో టీమిండియా మేనేజ్‌మెంట్ తలలు పట్టుకుంది.
ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్ ఆశలు (డ్రా) సజీవంగా ఉంచుకోవాలని ఆసీస్ భావిస్తుంటే.. ఈ మ్యాచ్‌ను కూడా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవడంతో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్ బెర్తు ఖరారు చేసుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది.
పిచ్ విషయానికొస్తే.. మూడో టెస్ట్‌కు వేదిక అయిన ఇండోర్‌లోని హోల్కర్ పిచ్ ఎర్ర మట్టితో తయారు చేసిందిగా తెలుస్తోంది. సహజంగా రెడ్ సాయిల్ పిచ్‌లు పేసర్లకు సహకరిస్తాయి. ఈ పిచ్‌లపై బౌన్స్ అధికంగా లభించే అవకాశముండటంతో ఆయా జట్లు అదనపు పేసర్‌కు అవకాశం కల్పిస్తుంటాయి.
ఈ క్రమంలో మూడో టెస్ట్‌లో భారత్, ఆసీస్‌లు కూడా అదనపు పేసర్‌తో బరిలోకి దిగే అవకాశం ఉంది. స్పిన్‌కు సహకరించిన తొలి రెండు టెస్ట్‌ల్లో ఇరు జట్లు ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగగా.. ఈ టెస్ట్ మ్యాచ్‌లో ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో ఇరు జట్లు బరిలోకి దిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి.
భారత తుది జట్టు కూర్పు విషయానికొస్తే.. టీమిండియా యాజమాన్యాన్ని కేఎల్ రాహుల్ ఫామ్ లేమి సమస్య ప్రధానంగా వేధిస్తుంది. గత 10 ఇన్నింగ్స్‌ల్లో ఒక్కసారి కూడా పాతిక పరుగుల మార్కు దాటని రాహుల్‌ను తుది జట్టు నుంచి తప్పించాలని సర్వత్రా డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో కేఎల్ రాహుల్ ఎంపిక జట్టు యాజమాన్యానికి తలనొప్పిగా మారింది.
పిచ్ ఎలాగూ పేస్‌కు సహకరించే అవకాశం ఉండటంతో రాహుల్‌ను తప్పించి అతని స్థానంలో అదనపు పేసర్‌కు (ఉమేశ్ యాదవ్ లేదా జయదేవ్ ఉనద్కత్) అవకాశం ఇవ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ యోచిస్తోంది. అయితే కెప్టెన్ రోహిత్ మాత్రం కేఎల్ రాహుల్‌కు మద్దతుగా నిలుస్తూ, అతనికి మరో అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. ఈ ఒక్క మార్పు మినహా రెండో టెస్ట్‌లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కేఎల్ రాహుల్‌ను తప్పిస్తే.. రోహిత్ శర్మతో పాటు శ్రీకర్ భరత్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించవచ్చు.
ఇక ఆసీస్ తుది జట్టు విషయానికొస్తే.. వ్యక్తిగత కారణాలతో రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ జట్టుకు దూరంగా ఉన్న నేపథ్యంలో స్టీవ్ స్మిత్ సారధ్య బాధ్యతలు మోయనున్నాడు. గాయాలు ఇతరత్రా కారణాల చేత జోష్ హాజిల్‌వుడ్, డేవిడ్ వార్నర్, ఆస్టన్ అగర్ స్వదేశానికి బయలుదేరగా.. కెమరూన్ గ్రీన్ రేపటి మ్యాచ్‌కు పూర్తి ఫిట్‌నెస్ సాధించాడని ఆసీస్ మేనేజ్‌మెంట్ ప్రకటించింది.
అయితే స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ విషయంలో మాత్రం టీమ్ మేనేజ్‌మెంట్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో రేపటి మ్యాచ్‌లో స్టార్క్ ఆడతాడా లేదా అన్న విషయం సందిగ్ధంగా మారింది. వార్నర్ స్థానంలో మ్యాట్ రెన్‌షా, కమిన్స్ స్థానంలో గ్రీన్ ఆడటం లాంఛనమే కాగా.. స్పిన్నర్ కన్హేమన్ స్థానంలో స్టార్క్ ఆడతాడా లేదా స్కాట్ బోలండ్, లాన్స్ మోరిస్‌లలో ఒకరికి అవకాశం ఇస్తారా అన్న విషయం తెలియాల్సి ఉంది.
భారత తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), శ్రీకర్ భరత్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్/జయదేవ్ ఉనద్కత్
ఆస్ట్రేలియా తుది జట్టు (అంచనా): మ్యాట్ రెన్‌షా, ఉస్మాన్ ఖ్వాజా, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, పీటర్ హ్యాండ్స్‌కోంబ్, కెమరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ, టాడ్ మర్ఫీ, నాథన్ లయోన్, మిచెల్ స్టార్క్/స్కాట్ బోలండ్/లాన్స్ మోరిస్
Comments
Please login to add a commentAdd a comment