India vs Australia 2023- 4th Test Captain Steve Smith: టీమిండియాతో నాలుగో టెస్టుకూ ఆస్ట్రేలియా రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ దూరమయ్యాడు. అతడి స్థానంలో స్టీవ్ స్మిత్ కంగారూ జట్టు సారథిగా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా తాజాగా ధ్రువీకరించింది. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్‌లో భాగంగా తొలి రెండు టెస్టులు ఆడిన కమిన్స్ మూడో మ్యాచ్‌కు ముందుకు స్వదేశానికి తిరిగి వెళ్లిన విషయం తెలిసిందే.
తన తల్లి మరియా అనారోగ్యంతో బాధపడుతున్నందున ఆమె బాగోగులు చూసుకునేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడు. ఈ క్రమంలో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన స్మిత్.. ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియాకు తొలి విజయం అందించాడు. అంతేగాక టీమిండియాపై ఇండోర్ మ్యాచ్‌లో విజయంతో ఆస్ట్రేలియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకుంది.
బ్రెస్ట్ క్యాన్సర్‌తో తల్లి పోరాటం
ఇదిలా ఉంటే.. కమిన్స్ ఆఖరిదైన అహ్మదాబాద్ టెస్టుకు అందుబాటులోకి వస్తాడనే అభిప్రాయాలు వ్యక్తం కాగా.. క్రికెట్ ఆస్ట్రేలియా ఆ అవకాశం లేదని పేర్కొంది. ‘ప్యాట్ కమిన్స్ తల్లి మరియా బ్రెస్ట్ క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. ఆమె బాగోగులు చూసుకునేందుకు కమిన్స్ సిడ్నీలోనే ఉండిపోయాడు. ఢిల్లీ టెస్టు తర్వాత స్వదేశానికి వచ్చిన అతడు నాలుగో టెస్టుకు కూడా దూరమయ్యాడు’’ అని తెలిపింది.
అంతేకాదు.. ఈ స్టార్ పేసర్ వన్డే సిరీస్‌కు కూడా అందుబాటులో ఉండే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని పేర్కొంది. ఇక కీలక బౌలర్ జై రిచర్డ్‌సన్ టీమిండియాతో వన్డే సిరీస్‌కు దూరం కాగా.. అతడి స్థానంలో నాథన్ ఇల్లిస్‌ను ఎంపిక చేసినట్లు తెలిపింది. ఇదిలా ఉంటే మార్చి 9 నుంచి అహ్మదాబాద్‌లో టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య నిర్ణయాత్మక నాలుగో టెస్టు ఆరంభం కానుంది. మార్చి 17, 19, 22 తేదీల్లో వన్డే సిరీస్ జరుగనుంది.
చదవండి: WPL 2023: పరుగుల వరద.. ముంబై టాపార్డర్ పటిష్టంగా ఉన్నా ఆర్సీబీ గెలుపు ఖాయం
Virat Kohli: నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు.. కనీసం: స్మృతి మంధాన
Comments
Please login to add a commentAdd a comment