Border- Gavaskar Trophy 2023: బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్ నేపథ్యంలో ఉపఖండ పిచ్‌ల గురించి క్రికెట్ ఆస్ట్రేలియా, మాజీ క్రికెటర్లు, మీడియా చేస్తున్న రచ్చ అంతా ఇంతాకాదు. ముఖ్యంగా నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభానికి ముందే ‘డాక్టర్డ్ పిచ్’ అంటూ నిందలు వేయడం, నాగ్‌పూర్, ఢిల్లీ టెస్టులు రెండున్నర రోజుల్లోనే ముగియడం.. రెండింటిలో గెలిచి టీమిండియా ఆధిక్యంలోకి వెళ్లడం.. తదితర పరిణామాలతో వారి వ్యాఖ్యలు శ్రుతిమించాయి.
ఇక మూడో టెస్టులో ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడం.. ఇండోర్ పిచ్ నాసిరకంగా ఉందంటూ ఐసీసీ మూడు డీమెరిట్ పాయింట్లు ఇవ్వడంతో వాళ్ల నోటిదురుసుకు తాళం పడింది. ఈ నేపథ్యంలో గతేడాది గబ్బాలో ఆస్ట్రేలియా- దక్షిణాఫ్రికాల మధ్య టెస్టు రెండు రోజుల్లోనే ముగియడం గురించి ప్రస్తావిస్తూ ఆసీస్, ఐసీసీ తీరును ఎండగట్టాడు టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్.
సెలక్టర్లపై గావస్కర్ ఫైర్
ఆసీస్‌లో జరిగిన ఆ టెస్టు కూడా రెండురోజుల్లోనే ముగిసిందని గుర్తుచేస్తూ.. అప్పుడు ఎన్ని డీమెరిట్ పాయింట్లు ఇచ్చారంటూ ప్రశ్నించాడు. ఈ క్రమంలో మొదటి రెండు టెస్టుల్లో ఆసీస్ ఓటములకు సెలక్టర్లను బాధ్యులను చేయాలంటూ గావస్కర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవతున్నాయి. పిచ్ గురించి రచ్చ చేయడం మానుకుని అసలు ఆస్ట్రేలియా సెలక్టర్లు ఏం చేస్తున్నారో గమనించాలంటూ హితవు పలికాడీ లెజెండ్. ఆటగాళ్లను విమర్శిస్తున్న వాళ్లు సెలక్టర్ల గురించి ఒక్క మాట మాట్లాడకపోవడం చిత్రంగా ఉందన్నాడు.
‘‘చాలా మంది ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు వివిధ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఆటగాళ్ల గురించి విమర్శలు చేస్తున్నారు. నిజానికి వాళ్లు సెలక్టర్లను టార్గెట్ చేయాల్సింది. తొలి రెండు టెస్టులకు అందుబాటులో ఉంటారో లేరోనని సందేహం ఉన్నప్పటికీ హాజిల్‌వుడ్, స్టార్క్, కామెరాన్ గ్రీన్‌లను ఎలా ఎంపిక చేస్తారు? అంటే సగం సిరీస్‌కు వాళ్లు అందుబాటులో ఉండరని తెలిసి సెలక్ట్ చేశారంటే 13 మందితోనే జట్టును ప్రకటించి ఉండవచ్చు కదా!
వాళ్లు వెంటనే రాజీనామా చేయాలి
ఇక అప్పటికప్పుడు కొత్త ప్లేయర్(మాథ్యూ కుహ్నెమన్)ను హడావుడిగా రప్పించారు. అలాంటి బౌలర్ జట్టుతో ఉన్నప్పటికీ మళ్లీ స్పిన్నర్‌ను తీసుకున్నారు. ఒకవేళ జట్టుకు ఆ ఆటగాడు అవసరం లేడనుకుంటే ముందే అతడిని ఎంపిక చేయడం ఎందుకు? తర్వాత అతడి స్థానాన్ని మరొకరితో భర్తీ చేయడం ఎందుకు? అంటే మేనేజ్‌మెంట్ 12 మంది ప్లేయర్ల నుంచి 11 మందిని ఎంపిక చేసుకుంటుందా? మరీ చిత్రంగా ఉంది.
సెలక్టర్లకు నిజంగా చిత్తుశుద్ధి, పని పట్ల అంకితభావం ఉంటే.. వెంటనే వాళ్లు రాజీనామా చేయాలి. ఒకవేళ మిగిలిన టెస్టుల్లో ఆస్ట్రేలియా విజయం సాధించినా సరే వాళ్లు తమ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిందే’’ అని స్పోర్ట్స్ స్టార్‌తో గావస్కర్ వ్యాఖ్యానించాడు. మూడో టెస్టుకు ముందు ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.
కాగా సిరీస్ ఆరంభంలోనే మిచెల్ స్వెప్సన్ తన తొలి సంతానాన్ని చూసుకునేందుకు స్వదేశానికి వెళ్లిపోగా.. జోష్ హాజిల్‌వుడ్ మడిమ నొప్పి, వార్నర్ మోచేతి గాయం, మ్యాట్ రెన్షా మోకాలి గాయంతో ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక తొలి రెండు మ్యాచ్‌లలో ఆడే అవకాశం రాని అష్టన్ అగర్ దేశవాళీ క్రికెట్‌పై దృష్టి సారించడానికి.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తన తల్లి అనారోగ్యం పాలవడంతో సొంత దేశానికి వెళ్లిపోయిన విషయం విదితమే.
చదవండి: WPL 2023: తొలి మ్యాచ్‌లోనే ఐదు వికెట్లు.. కేవలం రూ.10 లక్షలు మాత్రమే! ఎవరీ తారా నోరిస్?
WPL 2023: ముంబై ఇండియన్స్ రికార్డు బద్దలు కొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఒక్క మ్యాచ్‌తోనే రికార్డు గల్లంతు
Comments
Please login to add a commentAdd a comment