91 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో ఉస్మాన్ ఖ్వాజా (180) రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగలేదు. భారత బ్యాటింగ్ సందర్భంగా అక్షర్ పటేల్ కొట్టిన సిక్సర్‌ను ఆపే ప్రయత్నంలో ఖ్వాజా గాయపడ్డాడని, అందుకే అతన్ని ఓపెనర్‌గా పంపలేదని ఆసీస్ మేనేజ్‌మెంట్ వివరణ ఇచ్చింది.
ఖ్వాజా గాయపడటంతో అతని స్థానంలో ట్రవిస్ హెడ్‌కు జోడీగా మాథ్యూ కుహ్నేమన్ బరిలోకి దిగాడు. ఖ్వాజా గాయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అతను చివరి రోజు ఆటలో బరిలోకి దిగుతాడా లేదా అన్న విషయంపై సందిగ్ధత కొనసాగుతోంది. ఒకవేళ ఖ్వాజా గాయం పెద్దదై అతను బరిలోకి దిగలేకపోతే, ఆ ప్రభావం ఆసీస్‌పై భారీగా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
10 మంది ఆటగాళ్లతో ఆసీస్ బ్యాటింగ్ చేయాల్సి వస్తే అది ఆసీస్ విజయావకాశాలను భారీ దెబ్బకొడుతుందని, ఇది టీమిండియాకు కచ్చితంగా కలిసొస్తుందని టీమిండియా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కాగా, టీమిండియా మిడిలార్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌కు కూడా గాయం కారణంగా తొలి ఇన్నింగ్స్ బరిలోకి దిగని విషయం తెలిసిందే.
186 పరుగుల వద్ద కోహ్లి ఔటవ్వగానే టీమిండియా 571/9 స్కోర్ వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 3 పరుగులు పరుగులు చేసి, ఇంకా 88 పరుగులు వెనుకపడి ఉంది. ట్రవిస్ హెడ్ (3), మాథ్యూ కుహ్నేమన్ (0) క్రీజ్‌లో ఉన్నారు.
అంతకుముందు భారత ఇన్నింగ్స్‌లో కోహ్లితో పాటు శుభ్‌మన్ గిల్ (128) సెంచరీ చేయగా.. అక్షర్ పటేల్ (79) మెరుపు అర్ధసెంచరీతో అలరించాడు. దానికి ముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 482 పరుగులకు ఆలౌటైంది. ఉస్మాన్ ఖ్వాజా (180), గ్రీన్ (114) సెంచరీలతో కదంతొక్కగా.. అశ్విన్ 6 వికెట్లతో ఆసీస్ వెన్ను విరిచాడు. ఆసీస్ బౌలర్లలో లియోన్, మర్ఫీ తలో 3 వికెట్లు పడగొట్టగా.. స్టార్క్, కుహ్నేమన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
4 మ్యాచ్‌ల ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో మూడు మ్యాచ్‌ల అనంతరం భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. నాలుగో టెస్ట్‌లో భారత్ గెలిస్తే.. 3-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకోవడంతో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు కూడా అర్హత సాధిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment