
Virat Kohli: పరుగుల యంత్రం, బ్యాటింగ్ కింగ్ విరాట్ కోహ్లి.. ఫీల్డింగ్‌లోనూ కింగ్ అనిపించుకున్నాడు. బంగ్లాదేశ్‌తో ఇవాళ (డిసెంబర్ 4) జరుగుతున్న తొలి వన్డేలో కోహ్లి ఓ అద్భుతమైన క్యాచ్ అందుకుని ఔరా అనిపించాడు. వాషింగ్టన్ సుందర్ వేసిన ఇన్నింగ్స్ 23వ ఓవర్ 3వ బంతికి కళ్లు చెదిరే ఫ్లయింగ్ క్యాచ్ అందుకున్న కోహ్లి.. అప్పటికే సెట్ అయిన కీలక ప్లేయర్ షకీబ్ అల్ హసన్ (29)ను పెవిలియన్‌కు సాగనంపాడు. విరాట్ విన్యాసానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. కోహ్లి బ్యాటింగ్‌లోనే కాదు.. ఫీల్డింగ్‌లోనూ కింగేనని అభిమానులు అభినందిస్తున్నారు.
Brilliant by #ViratKohli 🦅#INDvsBAN #BANvIND #CricketTwitter pic.twitter.com/LLfKEBUfq5
— Rohit Yadav (@rohityadav1098) December 4, 2022
కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. బంగ్లా బౌలర్లు షకీబ్ అల్ హసన్ (5/36), ఎబాదత్ హొస్సేన్ (4/47) దెబ్బకు 186 పరుగులకే (41.2 ఓవర్లలో) చాపచుట్టేసింది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (70 బంతుల్లో 73; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మినహా అందరూ దారుణంగా విఫలమయ్యారు. శిఖర్ ధవన్ (7), కోహ్లి (9), షాబాజ్ అహ్మద్ (0), శార్ధూల్ ఠాకూర్ (2), దీపక్ చాహర్ (0), సిరాజ్ (9) పెవిలియన్‌కు క్యూ కట్టారు. కెప్టెన్ రోహిత్ శర్మ (27), శ్రేయస్ అయ్యర్ (24), వాషింగ్టన్ సుందర్ (19) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు.
అనంతరం 187 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. టీమిండియా బౌలర్ల ధాటికి 38.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 134 పరుగులు మాత్రమే చేసి ఓటమి దిశగా పయనిస్తుంది. బంగ్లా గెలవాలంటే 70 బంతుల్లో మరో 53 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజ్‌లో కొత్త బ్యాటర్లు మెహిది హసన్ (0), ఎబాదత్ హొస్సేన్ (0) ఉన్నారు. భారత బౌలర్లలో సుందర్, సిరాజ్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. దీపక్ చాహర్, కుల్దీప్ సేన్, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ దక్కించుకున్నారు.