Team India Tour Of England In July: టీమిండియా- ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన సిరీస్ నిర్ణయాత్మక ఐదో టెస్టు వాయిదా పడిన నాటి నుంచి రీ షెడ్యూల్ విషయం క్రీడావర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భారత ఆటగాళ్లకు కరోనా నిర్దారణ పరీక్షల్లో నెగటివ్ వచ్చినా ఆడేందుకు విముఖత చూపారని, కాబట్టి తాము ఓడినట్లు టీమిండియా అంగీకరించాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. అంతేగాక... మ్యాచ్ రద్దు కావడం వల్ల తమకు వాటిల్లిన నష్టం గురించి, విజేతను నిర్ణయించే అంశంలోనూ జోక్యం చేసుకోవాల్సిందిగా ఐసీసీ వివాద పరిష్కార కమిటీ(డీఆర్‌సీ)కి లేఖ కూడా రాసింది.
ఈ నేపథ్యంలో... మాంచెస్టర్ టెస్టును రీషెడ్యూల్ చేస్తామని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు. అయితే, మరో సిరీస్‌గా (ఏకైక టెస్టు) అనుమతించబోమని తేల్చిచెప్పారు. ఈ క్రమంలో ఆఖరి టెస్టు రద్దు కావడం వల్ల ఈసీబీకి జరిగిన నష్టాన్ని(సుమారు 40 మిలియన్ పౌండ్లు) పూడ్చేలా.. వచ్చే ఏడాది టూర్‌లో అదనపు టీ20లు ఆడేందుకు బీసీసీఐ సుముఖత వ్యక్తం చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై స్పందించిన బీసీసీఐ కార్యదర్శి జై షా వీటిని ధ్రువీకరించారు.
క్రిక్‌బజ్‌తో ఆయన మాట్లాడుతూ.. ‘‘అవును.. నిజమే.. జూలైలో పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో రెండు ఎక్స్‌ట్రా టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధంగా ఉన్నామని ఈసీబీకి చెప్పాం. మూడు టీ20లకు బదులు ఐదు మ్యాచ్‌లు ఆడతాం. అంతేకాదు రద్దైన టెస్టు మ్యాచ్ కూడా ఆడతాం. అయితే, మా ఆఫర్‌ను అంగీకరిస్తారా లేదంటే తిరస్కరిస్తారా అనేది వారి నిర్ణయానికే వదిలేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. కాగా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు వచ్చే ఏడాది జూలైలో టీమిండియా ఇంగ్లండ్ వెళ్లేందుకు షెడ్యూల్ ఖరారైన సంగతి తెలిసిందే.
చదవండి: IPL 2021 Phase 2: ఇయాన్ మోర్గాన్ నా గురించి ఏమనుకుంటున్నాడో..
Comments
Please login to add a commentAdd a comment