India Vs Ireland T20I Series: హార్దిక్ పాండ్యా సారథ్యంలోని భారత జట్టు ఆదివారం నుంచి ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ ఆడనుంది. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్ కోసం ఇప్పటికే ఇరు దేశాలు తమ జట్లను ప్రకటించిన విషయం తెలిసిందే. గాయం కారణంగా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు దూరమైన సూర్యకుమార్ యాదవ్ ఈ టూర్‌లో భాగంగా జట్టుతో చేరాడు.
అదే విధంగా మరో మహారాష్ట్ర బ్యాటర్ రాహుల్ త్రిపాఠికి తొలిసారిగా సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. అదే విధంగా ప్రొటిస్‌తో సిరీస్‌లో అదరగొట్టిన వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ సైతం ఐర్లాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టుకు ఎంపికయ్యాడు. చాన్నాళ్ల తర్వాత కేరళ బ్యాటర్ సంజూ శాంసన్ కూడా సెలక్ట్ అయ్యాడు.
సంజూ, ఇషాన్ కాదు.. డీకేకే ఛాన్స్!
ఈ క్రమంలో పాండ్యా సేన తుది జట్టు కూర్పు గురించి పలువురు మాజీ క్రికెటర్లు అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగా స్పోర్ట్స్ 18తో మాట్లాడిన మాజీ ఆటగాడు రోహన్ గావస్కర్‌కు ఈ సిరీస్‌లో ఎవరిని వికెట్ కీపర్‌గా ఎంచుకుంటారన్న ప్రశ్న ఎదురైంది.
ఇందుకు బదులిచ్చిన రోహన్.. సంజూ, ఇషాన్ కిషన్‌ను కాదని డీకేకు ఓటు వేశాడు. ఈ మేరకు.. ‘‘వికెట్ కీపర్లుగా ఈ ముగ్గురికి తమకంటూ ప్రత్యేక స్థానం ఉంది. అయితే, నేను మాత్రం.. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ తుది జట్టులో ఉన్నా కూడా డీకేకే వికెట్ కీపింగ్ బాధ్యతలు ఇస్తాను’’ అని స్పష్టం చేశాడు.
ప్రపంచకప్ జట్టులో అతడి పేరే ముందు!
ఇక సూర్యకుమార్ యాదవ్ జట్టుతో చేరడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన రోహన్ గావస్కర్.. ‘‘టీ20 ప్రపంచకప్ భారత జట్టు అనగానే నాకు మొదట గుర్తుకు వచ్చే పేరు సూర్యకుమార్ యాదవ్. ఎందుకంటే తనొక విలక్షణమైన ఆటగాడు. అత్యద్భుతమైన క్రికెటర్.
ఇప్పుడు ఈ సిరీస్‌తో ఫామ్‌లోకి వస్తే.. ప్రపంచకప్‌నకు ముందు మంచి ప్రాక్టీసు లభించినట్లవుతుంది. నిజంగా తను తిరిగి రావడం జట్టుకు మేలు చేస్తుంది’’ అని పేర్కొన్నాడు. అదే విధంగా.. ఉమ్రాన్ మాలిక్ గురించి మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్‌లో అదిరిపోయే ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. అద్భుతమైన బంతులు సంధించాడు. వికెట్లు కూడా తీశాడు.
అయితే, కొంతమంది అత్యంత వేగంగా బాల్ విసిరినా వికెట్లు తీయలేరు. అలాంటి వాళ్లు జట్టులో ఉన్నా కూడా ప్రయోజనం ఉండదు. అయితే, ఉమ్రాన్ మాత్రం ఈ రెండు లక్షణాలు కలగలిసిన ప్యాకేజ్. అతడి అరంగేట్రం కోసం అభిమానులతో పాటు నేనూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని రోహన్ గావస్కర్ చెప్పుకొచ్చాడు.
చదవండి: India Vs Ireland T20I Series Details: ఐర్లాండ్‌తో భారత్ టీ 20 సిరీస్.. ఇరు జట్లు, షెడ్యూల్.. పూర్తి వివరాలు!
Comments
Please login to add a commentAdd a comment